
అచ్చంపేట, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం పోలిశెట్టిపల్లి పరిధిలోని ఓ ప్రైవేటు స్కూల్లో సిగరెట్ తాగాడని టీచర్లు మందలించడంతో మనస్తాపం చెందిన స్టూడెంట్స్కూల్ వెనుక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్రాబాద్ మండలం మాదవానిపల్లికి చెందిన నర్సింహ, మణెమ్మల చిన్న కొడుకు మాదాని ఆకాశ్(16) అచ్చంపేట శివారులోని జేఎంజేహెచ్ స్కూల్లో ఎస్సెస్సీ చదువుతున్నాడు. తండ్రి నర్సింహ చిన్నప్పుడే చనిపోగా, తల్లి కూలి పని చేసి ఆకాశ్‌ను చదివిస్తోంది. సోమవారం ఆకాశ్ సిగరెట్ తాగాడని తెలియడంతో టీచర్లు మందలించారు. ఈ విషయాన్ని తల్లి మణెమ్మకు ఫోన్ చేసి చెప్పగా ఆమె కూడా తిట్టింది. మంగళవారం ఉద యం క్లాస్‌కు వచ్చిన ఆకాశ్ ఇంటర్ వెల్ బెల్ కాగానే స్కూల్ వెనుక ఉన్న మామిడి తోటలో చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. ఆకాశ్ క్లాస్‌లో కనిపించకపోవడంతో చూడగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. స్కూల్ మేనేజ్మెంట్ వేధింపులతోనే ఆకాశ్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు స్కూల్ ముందున్న శ్రీశైలం -–నాగర్ కర్నూల్ మెయిన్‌రోడ్డుపై రాస్తారోకో చేశారు. పోలీసులు వచ్చి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆందోళనలో పాల్గొన్న బీజేవైఎం లీడర్లను పోలీసులు అరెస్టు చేశారు.