అందరం ఈ అమ్మాయిలా ప్రశ్నిస్తే కేసీఆర్ భయపడడా?

అందరం ఈ అమ్మాయిలా ప్రశ్నిస్తే కేసీఆర్ భయపడడా?

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఓయూ లేడీస్ హాస్టల్ లో అన్నంలో గాజు ముక్కలు వచ్చాయంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రెండు వారాలుగా భోజనం సరిగ్గా ఉండటం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మెస్ బిల్లులు కట్టినా లిమిటెడ్ గా భోజనం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏమైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్నారు. ఈ ధర్నాలో ఓ విద్యార్థిని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలిదీసిన వీడియోను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన ట్విట్టర్లో షేర్ చేశారు.  అందరూ ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవాలని, ఆ విద్యార్థిని అభినందించారు.  అందరం ఇట్లాగే ప్రశ్నిస్తే KCR భయపడడా? అని అన్నారు. ఎక్కడ చూసినా ఇవే ఘటనలు పునరావృతమవుతున్నాయన్నారు. తెలంగాణ మోడల్ అనేది పేరుకేనని,  దేశం మొత్తానికి ఆదర్శం అనడం పెద్ద జోక్ అని ఆకునూరి మురళి ట్వీట్ చేశారు.  

‘గత రెండు వారాల నుంచి ఫుడ్ సరిగా ఉండడం లేదు. అన్నం గడ్డలు గడ్డలుగా అవుతుందని, నీళ్ల నీళ్ల సాంబారు, పెట్టిన కూరలే పెడుతున్నారు.. టిఫిన్లు, చట్నీలు అస్సలు బాలేవు. లిమిటెడ్ భోజనం పెడుతున్నారు. ఫుడ్ కొంచెం ఎక్కువ పెట్టమన్నా ప్రశ్నిస్తున్నారు. అమ్మాయిలు చాలా బలంగా ఉండాలి. అబ్బాయిల కంటే అమ్మాయిలే బలంగా ఉండాలి అని పేరుకే కొటేషన్స్ చెప్తారు. పేరుకే ఇలాంటి మాటలు మాట్లాడుతారు. మేము గాజు పెంకులొచ్చిన ఫుడ్ తిన్నాం. మాకేమైనా అయితే అధికారులే బాధ్యత వహించాలి. అది సీఎం అయినా, వీసీ అయినా సరే.. ఎవరనేది నాకు అవసరం లేదు. పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని మమ్మల్ని ఇక్కడికి పంపిస్తే.. ఇలాంటి ఫుడ్ పెడతారా. మా భోజనంలో గాజు పెంకులొచ్చాయి.. అవి లోపలికి వెళ్లుంటే మీరే బాధ్యులు’ అంటూ  విద్యార్థిని  తీవ్ర ఆరోపణలు చేశారు.