- నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి జడ్పీ హైస్కూల్‌లో ఘటన
దేవరకొండ (కొండమల్లేపల్లి), వెలుగు : స్కూల్‌లో మామిడి తోరణాలు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కొట్టడంతో ఓ స్టూడెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు రీఓపెన్ కావడంతో స్టూడెంట్లకు స్వాగతం పలికేందుకు కొండమల్లేపల్లి జెడ్పీ హైస్కూల్ ఆవరణ ముస్తాబులో భాగంగా మెయిన్ గేటుకు మామిడి తోరణాలు కట్టే పనులు చేపట్టారు. స్కూల్ పక్కనే ఉంటున్న జ్యోతి శేఖర్ దంపతుల కొడుకు రాంచరణ్ (13) స్థానిక ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్నాడు. సోమవారం ఆడుకునేందుకు కొండమల్లేపల్లి స్కూల్‌కు రావడంతో... తోరణాలు కట్టేందుకు సాయం చేయాలని టీచర్లు కోరారు.
దీంతో రాంచరణ్ గేటు పైకి ఎక్కి తోరణం కడుతుండగా.. పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో కరెంట్ షాక్ కొట్టి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన టీచర్లు, స్థానికులు వెంటనే దేవరకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఆదేశాలతో దేవరకొండ ఆర్డీవో పద్మప్రియ, డీఎస్పీ శ్రీనివాసరావు, కొండమల్లేపల్లి తహసీల్దార్ నరేందర్, ఎంపీడీవో స్వర్ణలత, ఎంఈఓ నాగేశ్వరరావు, విద్యుత్ ఏఈ దేవోజి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
