బస్సుల్లేక బడిపిల్లలు ఆగం

బస్సుల్లేక బడిపిల్లలు ఆగం
  • రాష్ట్రవ్యాప్తంగా స్టూడెంట్ల ఇబ్బందులు.. కానరాని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
  • చాలాచోట్ల పల్లెలు, మారుమూల ప్రాంతాలకు వెళ్లని బస్సులు
  • వెళ్లినా స్కూళ్లు, కాలేజీల ఈ తిప్పలు పడలేక చదువుకు దూరమవుతున్న ఆడపిల్లలు
  • స్కూళ్లు, కాలేజీల్లో తగ్గిపోయిన హాజరుశాతం
  • స్టూడెంట్లను ఎక్కిం చుకోని టెంపరరీ డ్రైవర్లు, కండక్టర్ లు
  • ఆటోలు, జీపుల్లో ప్రమాదకర ప్రయాణాలు

వెలుగు నెట్​వర్క్:

ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో సర్కారు విఫలం కావడం.. పల్లెలు, మారుమూల ప్రాంతాలకు బస్సులు నడవకపోతుండటంతో స్టూడెంట్లు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నరు. అంతా సాఫీగా ఉందని సర్కారు చెప్తున్నా.. రోజూ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి వచ్చే స్టూడెంట్స్ కు అష్టకష్టాలు తప్పడం లేదు. సమ్మెకు ముందు రోజూ లక్షల మంది స్టూడెంట్లు సొంతూర్ల నుంచి మండల కేంద్రాలు, పట్టణాల్లోని స్కూళ్లు, కాలేజీలకు బస్సుల్లో వెళ్లేవారు. సమ్మె మొదలైనప్పటి నుంచి పల్లెలకు, మారుమూల ప్రాంతాలకు బస్సులు నడవడం లేదు. కొన్నిచోట్ల బస్సులు వస్తున్నా ఇష్టమొచ్చిన టైంలో తిప్పుతున్నారు. దాంతో స్టూడెంట్స్​ ఆటోలు, జీపుల వంటి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.

డబ్బులెక్కువ.. ప్రమాదం కూడా..

ఆటోలు, జీపులవాళ్లు ప్రయాణికుల నుంచి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారు. వారు అడిగినంత ఇచ్చి వెళ్లాల్సిన పరిస్థితి. అంతేకాదు పరిమితికి మించి జనాన్ని ఎక్కిస్తున్నారు. దాంతో ఫుట్​బోర్డులపై, సైడ్​ రాడ్లను పట్టుకుని ప్రమాదకర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తోంది. అంతేకాదు టైముకు అందుబాటులో లేక పొద్దున ఏడు గంటలకే ఇంట్లోంచి బయలుదేరాల్సి వస్తోంది. ఇంటికి చేరేసరికి రాత్రి ఏడు దాటుతోంది. ఈ ఇబ్బందులు పడలేక చాలా మంది స్టూడెంట్లను వారి తల్లిదండ్రులు స్కూళ్లు, కాలేజీలకు పంపడం లేదు. ముఖ్యంగా ప్రైవేటు వాహనాల్లో పంపడం ఇష్టం లేక ఆడపిల్లల తల్లిదండ్రులు చదువు మాన్పించాలన్న ఆలోచిస్తున్నారు. బస్సుల్లేక అన్ని స్కూళ్లు, కాలేజీల్లో స్టూడెంట్ల హాజరు తగ్గిందని టీచర్లు చెప్తున్నారు.

దింపేస్తున్న టెంపరరీ సిబ్బంది

ప్రధాన రూట్లలో నడుస్తున్న చాలా బస్సుల్లో టెంపరరీ డ్రైవర్లు, కండక్టర్లు స్టూడెంట్లను ఎక్కనివ్వడం లే దు.  ఎక్కించుకుంటే కలెక్షన్ టార్గెట్​ నిండదని, అట్లైతే డీఎంలు డ్యూటీలు ఇవ్వరని దింపేస్తున్నారు. సాయంత్రం టైంలో ఈ పరిస్థితి ఎక్కువుంది. దాంతో మారుమూల ప్రాంతాల స్టూడెంట్లు ఇంటికి చేరేందుకు రాత్రి అవుతోంది. గతంలో పోలిస్తే బస్సుల సంఖ్య సగానికి తగ్గడంతో ఫుట్​బోర్డుపై నిలబడి, టాప్‌పై ఎక్కి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. బస్సులు తిరగని ప్రాంతాల వాళ్లు, టైంకు బస్సు అందుకోలేనివారు ఆటోలు, జీపులను ఆశ్రయిస్తున్నారు.

కాలేజీ బంద్​ చెయ్యిమంటున్నరు

మాది అన్నపురెడ్డి మండలం ఒడ్డుగూడెం. ములకలపల్లి గవర్నమెంట్​జూనియర్​ కాలేజీల సెకండియర్​ చదువుతున్న. నాన్న రాజులు వికలాంగుడు. అమ్మ ఈశ్వరి అంగన్​వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తది. మేం ముగ్గురం ఆడపిల్లలం. నన్ను కష్టపడి చదివిస్తున్నారు. ఇప్పుడు బస్సుల్లేక ఆటోలో కాలేజీకి వెళ్తున్న. నెలకు వెయ్యి రూపాయల దాకా అవుతోంది. ఇట్ల పైసలు కట్టలేమని, కాలేజీ బంద్ ​చెయ్యిమని అంటున్నారు. బస్సులు నడిస్తె ఈ బాధ తప్పుతది. – కాకా శిరీష, ఇంటర్​ విద్యార్థిని

ఎగ్జామ్ మధ్యాహ్నం.. పొద్దున్నే వెళ్లాలె..

మాది జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని గబ్బెట. యశ్వంతాపూర్ లోని కాలేజీలో డిప్లొమా చేస్తున్న. మొన్నటిదాక మా ఊరికి పొద్దున మూడు ట్రిప్పులు, మధ్యాహ్నం రెండు ట్రిప్పులు బస్సులు నడిచేవి. మంచిగ కాలేజీకి పొయొచ్చేటోళ్లం. ఇప్పుడు సమ్మెతోటి ఒక్క బస్సు కూడా నడుస్తలేదు. నాకు మధ్యాహ్నం 2 గంటలకు ఎగ్జామ్ ఉన్నా.. పొద్దున ఏడు గంటలకే ఇంట్లోంచి బయలుదేరుతున్న. – చిట్యాల అరుణ్ ప్రసాద్, డిప్లొమా స్టూడెంట్

హాజరుశాతం తగ్గింది

మా మోడల్​ స్కూల్​కు మండలంలోని వివిధ గ్రామాల నుంచి 585 మంది స్టూడెంట్లు బస్సుల్లో వచ్చేవారు. సమ్మె కారణంగా బస్సుల్లేక స్టూడెంట్ల హాజరు తగ్గింది. రోజూ 350, 400 మందిలోపే వస్తున్నరు. వాళ్లు కూడా ప్రైవేట్​ వాహనాల్లో అష్టకష్టాలు పడి వస్తున్నమని చెప్తున్నరు. –విజయ, దొబ్బలపహాడ్​ మోడల్​ స్కూల్ ప్రిన్సిపల్, జయశంకర్​ భూపాలపల్లి జిల్లా

అటెండెన్స్​ పడ్తలేదు

ఆర్టీసీ సమ్మె కారణంగా కాలేజీకి సకాలంలో వెళ్లలేకపోతున్నం. సాయంత్రం కూడా బస్సులు రాక ఇబ్బంది తప్పుతలేదు. కాలేజీకి లేటుగా వెళ్తుండటంతో అటెండెన్స్ పడ్తలేదు. మండలంలోని ఊర్లలో ఉన్న స్కూళ్లకు టీచింగ్ ప్రాక్టీస్ కు వెళ్లాలంటే ఆటోలే దిక్కవుతున్నయి.  – — ఎం దీప్తి, డైట్ స్టూడెంట్, జనగామ

భయపడుతూ పోతున్నం

బస్సులు బందైనప్పటి నుంచి ఆటోల్లో కాలేజీకి పోతున్నం. తినీ తినక పొద్దున ఏడు గంటలకే బస్టాండుకు చేరుతున్నం. ఒక్కోసారి గంట గంటన్నర నిలబడితే తప్ప ఆటో దొరుకుతలేదు. ఆటో వచ్చినా నిండే దాక పోదు. సైడ్​లో రాడ్​ పట్టుకొని భయంతోనే వేలాడుకుంటూ​పోవాల్సి వస్తున్నది. –గంట సురేష్​, ఐటీఐ విద్యార్థి, జప్తి సదగోడు

రోజూ లేటైతున్నది

మాది తిరుమలాపూర్. టౌన్ లోని కేరళ స్కూల్ లో ఐదోతరగతి చదువుతున్న. సమ్మె కు ముం దు బస్సులు టైంకు వచ్చేవి. ఇప్పడు లేటయితున్నయి. లేటుగ బడికి వెళ్తే టీచర్లు కోప్పడుతున్నరు. స్కూల్ అయిపోయినంక ఇంటికి వచ్చే సరికి రాత్రి 7.30 అయితున్నది. అలసిపోయి హోమ్ వర్క్ కూడా సరిగ చేయట్లే. –స్వాతి, ఐదోతరగతి, తిరుమలాపూర్

 

మరిన్ని వార్తలు