
- నల్గొండ జిల్లాలో మొక్కుబడిగా సాగిన ప్రోగ్రాం
- స్పెషల్ ఎన్‌రోల్‌మెంట్‌పై దృష్టి పెట్టని ఎడ్యుకేషన్ ఆఫీసర్లు
- అంగన్ వాడీలు, ప్రభుత్వ స్కూళ్లలో చేరింది 176 మందే...
- ప్రైవేట్ నుంచి సర్కార్ బడుల్లో 252 మంది చేరిక
- పుస్తకాలు, దుస్తుల గురించి నిలదీస్తున్న పేరెంట్స్
నల్గొండ, వెలుగు : సర్కార్ స్కూల్స్‌లో కొత్త స్టూడెంట్లను చేర్పించాలన్న లక్ష్యంతో చేపట్టిన బడిబాట కార్యక్రమంలో నల్గొండ జిల్లా వెనుకబడింది. ఈ నెల 3 నుంచి 10 వరకు చేపట్టాల్సిన కార్యక్రమంలో ముఖ్యంగా న్యూ ఎన్‌రోల్‌మెంట్‌పై ఎడ్యుకేషన్ ఆఫీసర్లు దృష్టి పెట్టాల్సి ఉంది. కానీ జిల్లాలో ఈ నెల 9 వరకు జరిగిన ఎన్‌రోల్‌మెంట్‌ను పరిశీలిస్తే అసలు బడిబాట ప్రోగాం పట్ల ఆఫీసర్లు ఏ మాత్రం ఇంట్రస్ట్ చూపించినట్లు కనిపించడం లేదు. బడిబాట కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా మొదలుపెట్టిన ఆఫీసర్లు ఆ తర్వాత దాని గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. సర్కార్ స్కూళ్లను బలోపేతం చేసేందుకు అడ్మిషన్ల సంఖ్యను గణనీయంగా పెంచడమే ఈ ప్రోగాం ప్రధాన ఉద్దేశం. కానీ అసలు కొత్త అడ్మిషన్ల జోలికే పోలేదన్నట్టుగా బడిబాట గణాంకాలు చెపుతున్నాయి. విద్యాశాఖ లెక్కల ప్రకారం 3 నుంచి 9 వరకు నిర్వహించిన ఇంటింటి బడిబాట కార్యక్రమంలో గుర్తించిన పిల్లల్లో కొత్తగా 110 మంది స్టూడెంట్లు మాత్రమే ప్రభుత్వ
స్కూల్స్‌లో ఒకటో తరగతిలో చేరారు. మరో 66 మంది పిల్లలు ప్రీ ప్రైమరీ సెక్షన్‌లో చేరారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 588 మందికి మాత్రమే ప్రవేశం కల్పించారు.
ఇంగ్లీష్ మీడియం అని చెప్పినా...
సర్కార్ స్కూల్స్‌లో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నామన్న సంగతి గురించి విస్తృతం ప్రచారం కల్పించాలని ప్రభుత్వం చెప్పింది. దీని వల్ల ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్లు ప్రభుత్వ స్కూళ్లలో చేరుతారని, తద్వారా పేద, నిరుపేద స్టూడెంట్లకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావించింది. కానీ ఆ దిశగా చేసిన ప్రయత్నాలు బడిబాటలో సక్సెస్ కాలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు, హెచ్‌ఎంలు, టీచర్లు, సీఆర్పీల భాగస్వామ్యంతో జరగాల్సిన కార్యక్రమం అడుగు కూడా ముందుకు పడలేదు. తొమ్మిది రోజుల ప్రోగాంలో ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ బడుల్లో చేరిన స్టూడెంట్లు కేవలం 252 మాత్రమే. వీరంతా రెండో తరగతి నుంచి ఎనిమిదో తరగతి చెందిన విద్యార్థులు. గతేడాది కరోనా కారణంగా ఫీజులు కట్టలేక తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించిన పేరెంట్స్ ఇప్పుడు మాత్రం అంతగా ఆసక్తి చూపించడం లేదని టీచర్లు చెబుతున్నారు. పైగా స్కూళ్ల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిగా లేకపోవడం కూడా ప్రధాన కారణమని అంటున్నారు.
దుస్తులు, పుస్తకాల కోసం నిలదీత
బడిబాట ప్రచారం కోసం వెళ్లిన టీచర్లు, సీఆర్పీలను పిల్లల తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. గతేడాది స్టూడెంట్లకు స్కూల్ డ్రెస్ ఇవ్వలేదని, పుస్తకాలు కూడా సక్రమంగా సప్లై చేయలేదని ప్రశ్నించారు. స్కూళ్లలో టీచర్ల కొరత కూడా ఉందని, దీని వల్ల స్టూడెంట్లు తీవ్రంగా నష్టపోతున్నారని, ఎక్కువ మంది స్టూడెంట్లు ఉన్న స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉందని టీచర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ బడిబాట కార్యక్రమంపై కూడా ఉందని అంటున్నారు. తెలుగు మీడియంకు సమాంతరంగా ఇంగ్లీష్ మీడియం కూడా నడుస్తుందని చెప్తున్నా పేరెంట్స్ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు ఇంగ్లీషు మీడియం పుస్తకాలు కూడా రాకపోవడం కూడా ప్రధాన సమస్యగానే
చూపిస్తున్నారు.
టెట్, టెన్త్ స్పాట్ బిజీలో టీచర్లు, సీఆర్పీలు
టెట్, టెన్త్ స్పాట్‌ను సాకుగా చూపి చాలా మంది టీచర్లు, హెచ్‌ఎంలు, సీఆర్పీలు బడిబాట ప్రోగాంలో పాల్గొనలేదు. ఆఫీసర్లు టెట్‌బిజీలో ఉండడంతో వారు కూడా బడిబాటపై ఫోకస్ పెట్టలేకపోయారు. పైగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో టీచర్లు డ్యూటీ ఎగ్గొట్టారు. పలువురు సీఆర్పీలు టెట్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్లు కూడా ఉన్నారు. శుక్రవారంతో బడిబాట కార్యక్రమం ముగిసింది. కానీ సోమవారం నుంచి బడులు తెరిచాక రోజుకో కార్యక్రమం చొప్పున ఈ నెల 30 వరకు బడిబాట కొనసాగించనున్నారు. ఇందులో కొత్త ఎన్‌రోల్‌మెంట్‌పైన దృష్టి సారిస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు.