ఓ స్టూడెంట్​ను అకారణంగా కొట్టిన్రు

ఓ స్టూడెంట్​ను అకారణంగా కొట్టిన్రు

నందిపేట, వెలుగు : ఓ స్టూడెంట్​ను అకారణంగా ముగ్గురు టీచర్లు ఒకరి తర్వాత ఒకరు చితకబాదడంతో అతడి కర్ణభేరి పగిలి దవాఖానా పాలయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు ఔట్​సోర్సింగ్​ఉపాధ్యాయులను అధికారులు సస్పెండ్​ చేశారు. బాధితుడి కథనం ప్రకారం..నిజామాబాద్ ​జిల్లా నందిపేట మండలంలోని నూత్​పల్లి మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల స్కూల్​లో ఈ నెల 7వ తేదీ నుంచి అంతర్​జిల్లా పాఠశాలల క్రీడలు జరుగుతున్నాయి. శుక్రవారం ముగింపు కాగా, ఆటలాడడానికి వచ్చిన వేరే స్కూల్​ స్టూడెంట్​ ఒకరు సీసీ కెమెరాను పాడు చేస్తున్నాడు. దీన్ని నూత్​పల్లి స్కూల్​లో ఎస్సెస్సీ చదువుతున్న రుషేందర్​ చూస్తూ ఉన్నాడు. అప్పుడే పీఈటీ శ్రీకాంత్అ క్కడికి వచ్చి ‘ అతడెవరో కెమెరాను చెడగొడుతుంటే నువ్వు సైలెన్స్​గా ఎందుకున్నావ్​’ అంటూ రుషేందర్​ను ఆఫీసు రూం కు తీసుకెళ్లి మెడ , చెవి పై కర్రతో కొట్టాడు. రుషేందర్​​ చెవి నుంచి రక్తం కారగా తుడుచుకున్నాడు.

కొద్దిసేపటికి ఇదే స్కూల్​లో పని చేస్తున్న​టీచర్లు నరేశ్, శంకర్​ కూడా వచ్చి చేయి చేసుకోగా చెవి నుంచి మళ్లీ రక్తం కారింది. దీంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాకు తీసుకువెళ్లారు. ఘటన శుక్రవారం జరగ్గా శనివారం తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు టీచర్లపై కలెక్టర్​ కు కంప్లయింట్​ చేశారు. స్కూల్​కు వచ్చినప్పుడల్లా తాము రూల్స్​ మాట్లాడటం సహించలేకే తమ కొడుకును కొట్టారని ఆరోపించారు. స్కూల్​ ఎదుట ఆందోళన చేయగా ఆర్​సీఓ సత్య నారాయణ వచ్చి వారితో మాట్లాడారు. ఘటనకు బాధ్యులైన ఔట్​సోర్సింగ్​పీఈటీ శ్రీకాంత్, టీచర్​ శంకర్​లను సస్పెండ్​చేశామని, రెగ్యులర్​ టీచర్​ నరేశ్​పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరామని చెప్పారు. దీంతో  ఆందోళన విరమించారు.