
- ప్రమాదకరంగా మారిన 87 ఏండ్ల నాటి భవనం
- పురాతన బిల్డింగ్‌లోనే 400మందికి చదువు
- ఆందోళనలో టీచర్లు, స్టూడెంట్లు
భైంసా, వెలుగు: పట్టణంలోని గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇటీవల వానల కారణంగా 87 ఏండ్ల నాటి ఆ బిల్డింగ్‌లో ఆదివారం అర్ధరాత్రి తర్వాత పెచ్చులూడాయి. క్లాస్ రూమ్‌లోకి, హెచ్ఎం ఆఫీస్‌లోకి నీళ్లు వచ్చాయి. టేబుళ్లు, ఫైళ్లు అన్నీ తడిచిపోయాయి. తరగతి గదుల్లో పాఠాలు చెప్పడానికి వీలులేకపోవడంతో.. టీచర్లు, విద్యార్థులు ఆరుబయటే కూర్చున్నారు. అదే టైంలో వానకురవడం వల్ల ఇబ్బంది పడ్డారు.
87 ఏండ్ల బిల్డింగ్..
ఉమ్మడి మహారాష్ట్రలో భైంసా ప్రాంతం ఉండడంతో 1935లో ఈ బిల్డింగ్ నిర్మించారు.
రాష్ట్రాల విభజనలో భాగంగా భైంసా ప్రాంతం తెలంగాణలో కలిసింది. నేటి వరకు ఆ స్కూల్ బిల్డింగ్‌కు సరైన సౌకర్యాలు కల్పించలేదు సర్కారు. పలుమార్లు స్కూల్ సమస్యలు పరిష్కరించాలని స్థానికులు, టీచర్లు కోరినా పట్టించుకోలేదు. దాదాపు 400 మంది విద్యార్థులు ఈ స్కూల్లో చదువుకుంటున్నారు. ఆదివారం రాత్రి పదో తరగతి గదుల్లో పైన, సైడ్స్లకు పెచ్చులుడి పడ్డాయి. ఆ టైంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వర్షాలతో వారం రోజుల తర్వాత స్కూళ్లు ప్రారంభం కాగా.. టీచర్లు, స్టూడెంట్స్ కింద పడిన పెచ్చులను చూసి ఆందోళకు గురయ్యారు. దీంతో పాటు హెచ్ఎం ఆఫీస్‌లో ఉరుస్తోంది. ముఖ్యమైన ఫైళ్లు తడిసిపోయాయి. కాగా.. ఈ స్కూల్లో చదివిన వారంతా ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారు. శాస్త్రవేత్తలు, కేంద్ర, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో ఉన్నత ఉద్యోగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అలాంటి విద్యార్థులను అందించిన స్కూల్‌పై సర్కారు చిన్నచూపు చూస్తుందని పూర్వ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
మన ఊరు-మన బడిలో ఎంపిక..
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భైంసా గవర్నమెంట్ హైస్కూల్‌ను ఎంపిక చేశారు. మొదట రూ. 3.8కోట్లు మంజూరు చేయగా.. తర్వాత రూ. 2కోట్ల కు తగ్గించారు. అయినా ఈ స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు నిర్వహించలేకపోతున్నారు అధికారులు. ప్రస్తుతం ఈ స్కూల్లో సరైన వసతులు లేక టీచర్లు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెచ్చులు ఊడి పడుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకోని విద్యబోధన సాగిస్తున్నారు. అటు పోషకులు సైతం అసహానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొత్త బిల్డింగ్ నిర్మించి అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రమాదకరంగా మారింది
గవర్నమెంట్ హైస్కూల్‌ను 1935లో అప్పటి మహారాష్ట్ర సర్కారు నిర్మించింది. ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరి కూలిపోతోంది. ఇప్పటికే పది గదుల్లో పెచ్చులుడిపడ్డాయి. భయం భయంతో తరగతులను కొనసాగిస్తున్నాం. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని మా సిబ్బంది, స్టూడెంట్స్ భయాందోళనలో ఉన్నాం. వెంటనే కొత్త బిల్డింగ్ నిర్మించాలి.
- మోహన్‌రావు, హెచ్ఎం