హెలికాప్టర్లోఎగ్జామ్ సెంటర్కు.. అద్దెకు తీసుకుని రాజస్థాన్ నుంచి ఉత్తరాఖండ్‌కు స్టూడెంట్స్

హెలికాప్టర్లోఎగ్జామ్ సెంటర్కు.. అద్దెకు తీసుకుని రాజస్థాన్ నుంచి ఉత్తరాఖండ్‌కు స్టూడెంట్స్

ఉత్తరాఖండ్: రాజస్తాన్ కు చెందిన నలుగురు బీఎడ్ విద్యార్థులు ఉత్తరాఖండ్ లోని ఎగ్జామ్ సెంటర్ ను చేరుకోవడానికి హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నారు. ఈ పరీక్షా కేంద్రం మున్సియారిలో ఉంది. అయితే, ఉత్తరాఖండ్ లో భారీ వర్షం కురువడంతో కొండచరియలు విరిగిపడి ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లే రోడ్లన్ని మూసుకుపోయాయి. 

ఈ క్రమంలో స్టూడెంట్లు సెంటర్ కు హెలికాప్టర్ లో వెళ్లారు. రాజస్తాన్ బలోత్రా టౌన్ కు చెందిన నలుగురు స్టూడెంట్లు ఉత్తరాఖండ్ ఓపెన్ వర్సిటీ ఎగ్జామ్ రాయడానికి మున్సియారిలోని ఆర్‌‌ఎస్ టోలియా పీజీ కాలేజీకి వెళ్లాల్సి వచ్చింది. ఈ స్టూడెంట్లు ఆగస్టు 31న హల్ద్వానీ చేరుకున్నారు. 

అయితే, ఉత్తరాఖండ్ లో భారీ వర్షం కురువడంతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో హల్ద్వానీ నుంచి మున్సియారీకి వెళ్లే రహదారులన్ని మూసుకుపోయాయి. దీంతో ఎగ్జామ్ రాయలేమని.. తమ ఏడాది సమయం వృథా అవుతుందని స్టూడెంట్లు బాధపడ్డారు. అదే సమయంలో హల్ద్వానీ నుంచి మున్సియారికి హెలికాప్టర్ నడిపే హెరిటేజ్ ఏవియేషన్ సంస్థ గురించి వారికి తెలిసింది.

 ప్రతికూల వాతావరణం కారణంగా ఆ కంపెనీ కూడా హెలికాప్టర్ నడపడం లేదని విద్యార్థులు తెలుసుకున్నారు. దీంతో కంపెనీ సీఈవోని కలిసి తమను ఎగ్జామ్ సెంటర్ కు తీసుకెళ్లాలని అభ్యర్థించారు. దీంతో ఆయన ఇద్దరు పైలట్లు, ఒక హెలికాప్టర్ ను పంపించారు. వారు స్టూడెంట్లను మున్సియారీకి తీసుకెళ్లి హల్ద్వానీకి తిరిగి తీసుకొచ్చారు. హెలికాప్టర్ ఒకవైపు ప్రయాణానికి రూ.5,200 అయిందని స్టూడెంట్లు పేర్కొన్నారు.