- ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ అరుణ రెడ్డి సూచన
- అంబేద్కర్ కాలేజీలో అవగాహన సదస్సు
- హాజరైన కరస్పాండెంట్ డాక్టర్ సరోజా వివేక్
ముషీరాబాద్, వెలుగు: విద్యార్థులు పక్కాగా ప్లాన్చేసుకొని ముందుకెళ్తే.. మంచి ఫలితాలు రాబట్టవచ్చని ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ అరుణ రెడ్డి సూచించారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు వర్క్‌ను పూర్తి చేసుకోవాలని, పోస్ట్ పోన్ చేయకూడదన్నారు.
అండర్ స్టాండింగ్, స్ట్రెస్, అన్జైటీ, డిప్రెషన్ వంటి అంశాలపై బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కాలేజీలో డిగ్రీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సైకియాట్రిస్ట్ డాక్టర్ అరుణ రెడ్డి, కరస్పాండెంట్ డాక్టర్ సరోజా వివేక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అరుణారెడ్డి మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో యువత ఫోన్లకు అలవాటు పడి తమ జీవితం, కాలాన్ని వృథా చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీని నైపుణ్యాభివృద్ధికి ఉపయోగించుకుంటే భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని.. లేదంటే జీవితం అంధకారంలోకి వెళ్తుందని హెచ్చరించారు.
విద్యార్థులు మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సరోజా వివేక్ సూచించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఫ్యాకల్టీకి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ప్రిన్సిపల్స్ సృజన, మట్ట శేఖర్, విట్టలా చారి పాల్గొన్నారు.
