రెగ్యులర్ పీజీపై స్టూడెంట్స్ అనాసక్తి​

రెగ్యులర్ పీజీపై స్టూడెంట్స్ అనాసక్తి​

గతేడాది 26 వేల సీట్లకు 10 వేలే భర్తీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెగ్యులర్​ పీజీ చేసేందుకు స్టూడెంట్స్​ ఆసక్తి చూపడం లేదు. క్యాంపస్ సీట్లు నిండుతున్నా.. ప్రైవేట్​ కాలేజీల్లో సగం సీట్లు మిగిలిపోతున్నాయి. 2021–22 కామన్ పీజీ సెట్ (సీపీగెట్)​లో 63,609 మంది క్వాలిఫై అయ్యారు. అయితే మొత్తం స్టేట్ వైడ్​గా 320 పీజీ కాలేజీల్లో 41,100 సీట్లుండగా, వాటిలో 22,763 సీట్లే భర్తీ అయ్యాయి. మరో 18,337  సీట్లు మిగిలాయి. లాస్టియర్ మొత్తం 46 కోర్సులకు ఎమ్​కాం, ఎంఎస్సీ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ, బాటనీ, ఇంగ్లిష్, తెలుగు తదితర కోర్సుల్లోనే వెయ్యికిపైగా సీట్లు నిండాయి. మిగిలిన కోర్సుల్లో తక్కువగానే అడ్మిషన్లు జరిగాయి. ఎమ్​కాం​కు గతంలో భారీగా డిమాండ్ ఉండటంతో ఎక్కువ కాలేజీలు ఆ కోర్సును ఎంపిక చేసుకున్నాయి. కానీ ఎమ్​కాం​లో 8,092 సీట్లకు కేవలం 3,104 నిండాయి. ఈ కోర్సులోనూ  భారీగా సీట్లు మిగిలాయి.  ఎంఎస్సీ మ్యాథ్స్​లో 4,784  సీట్లుకు 2,095 మాత్రమే నిండాయి. 2021–22 అడ్మిషన్ల వివరాలను ఇటీవల హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ రిలీజ్ చేసింది. 

క్యాంపస్ సీట్లకు తగ్గని డిమాండ్​ 

ఆరు యూనివర్సిటీల పరిధిలోని 233 ప్రైవేటు కాలేజీల్లో 26,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 10,199 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అత్యధికంగా ఓయూ పరిధిలో 9,930 సీట్లుంటే 4,239, కాకతీయ వర్సిటీ పరిధిలో 6,180 సీట్లుంటే 2,521, శాతవాహన వర్సిటీలో 4,745 సీట్లుంటే 1,940 సీట్లు నిండాయి. మిగిలిన 3 వర్సిటీల్లో 600లోపే అడ్మిషన్లు అయ్యాయి. మరో పక్క ఆరు వర్సిటీల పరిధిలోని 47 గవర్నమెంట్ కాలేజీల్లో 8,140 సీట్లుంటే, 4,174  సీట్లు భర్తీ అయ్యాయి. ఓయూ, కేయూ, పాలమూరు, శాతవాహన వర్సిటీల పరిధిలోని కాన్​స్టి​ట్యూయెంట్, పీజీ సెంటర్లు 20 ఉండగా, వాటిలో 4,217 సీట్లున్నాయి. వాటిలో 3,140 భర్తీ అయ్యాయి. అయితే  క్యాంపస్ సీట్లకు మాత్రం డిమాండ్​ తగ్గలేదు. ఓయూ, కేయూ, టీయూ, ఎంజీయూ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీయూహెచ్​ వర్సిటీల్లో 20 క్యాంపస్ కాలేజీలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 5,527 సీట్లుంటే  గతేడాది 5,299 సీట్లు భర్తీ అయ్యాయి.