
హైదరాబాద్, వెలుగు: డిగ్రీ కోర్సులపై స్టూడెంట్స్కు ఇంట్రెస్ట్ తగ్గుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి భారీగా అడ్మిషన్స్ తగ్గాయి. మరోపక్క జీరో అడ్మిషన్స్ కాలేజీలు, కోర్సుల సంఖ్య పెరిగింది. ఇంటర్‌లో వచ్చిన ఫలితాల ఎఫెక్ట్ కూడా అడ్మిషన్స్పై పడిందని అంటున్నారు. కారణాలేవైనా ఏకంగా సగానికిపైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి.
రాష్ట్రంలో 987 డిగ్రీ కాలేజీల్లోని వివిధ కోర్సుల్లో 3 లక్షల86 వేల సీట్లున్నాయి. ఈ ఏడాది మూడో విడత కౌన్సెలింగ్ తర్వాత లక్షా 76 వేల 039 మంది డిగ్రీలోని వివిధ కోర్సుల్లో చేరారు. మరో 2.1 లక్షల సీట్లు మిగిలాయి. గవర్నమెంట్ కాలేజీల్లో 41 వేల740 మంది, ప్రైవేట్‌లో లక్షా 31 వేల140 మంది, యూనివర్సిటీ కాలేజీల్లో 3 వేల159 మంది చేరారు. పట్టణ ప్రాంత కాలేజీల్లో ఎక్కువ మంది చేరగా, గ్రామీణ ప్రాంత కాలేజీల్లో చేరేందుకు స్టూడెంట్స్ ఇష్టపడలేదు. ‘దోస్త్’లో లేని 50 వరకూ ఉన్న మైనార్టీ కాలేజీల్లోనూ అడ్మిషన్లు అంతంత మాత్రమే.
మూడు విడతల దోస్త్ అడ్మిషన్స్ తర్వాత కూడా 78 డిగ్రీ కాలేజీల్లో ఒక్క స్టూడెంటూ చేరలేదు. గతేడాది ఆ సంఖ్య 54 ఉండగా ఈసారి పెరిగింది. వీటితోపాటు 727 కాంబినేషన్స్ కోర్సుల్లోనూ ఒక్కరూ చేరలేదు. కాంబినేషన్స్ కోర్సుల పరిధిలో 39 వేల 775 సీట్లుండటం గమనార్హం. జీరో అడ్మిషన్స్ కాలేజీలు కాకతీయ వర్సిటీ పరిధిలో 26 ఉన్నాయి. ఓయూ పరిధిలో 18 కాలేజీలున్నాయి. మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలో 13, శాతవాహన పరిధిలో 10, తెలంగాణ వర్సిటీ పరిధిలో ఆరు, పాలమూరు పరిధిలో ఐదు ఉన్నాయి.
బీకాం సీఏకు ఫుల్ డిమాండ్
డిగ్రీలో ఆర్ట్స్, కామర్స్ కోర్సులతో పోలిస్తే సైన్స్ కోర్సులనే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎంచుకున్నారు. సైన్స్ కోర్సుల్లో లక్షా 904 మంది చేరగా, మిగిలిన వాళ్లు ఆర్ట్స్ అండ్ కామర్స్ కోర్సుల్లో చేరారు. సబ్ కోర్సులవారీగా చూస్తే ఈ ఏడాది డిగ్రీ బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సుకు ఫుల్‌డిమాండ్ ఉంది. ఏకంగా 56,902 మంది అడ్మిషన్స్ పొందారు. తర్వాత బీఎస్సీ బీజెడ్సీ, బీఎస్సీ ఎంపీసీఎస్ కోర్సుల్లో చేరారు. మొత్తం సర్కారీ కాలేజీల్లో 57 శాతం సీట్లు నిండగా, ప్రైవేట్ కాలేజీల్లో 43 శాతమే నిండాయి.