
సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది గురుకుల విద్యార్థులకు చికిత్సలు చేశారు. గురుకులంలో 4వందల మంది విద్యార్థులుండగా.. వారిలో 30 మంది వరకు జ్వరం, జలుబు, కడుపునొప్పితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
ఫుడ్ పాయిజన్ అంటూ ప్రచారం..
మిరుదొడ్డి గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయిందంటూ ముందు ప్రచారం జరిగింది. దీంతో స్థానిక నాయకులు హాస్టల్కు చేరుకొని విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. ఆ తర్వాత జ్వరం, జలుబుతో బాధపడుతున్నారని తెలుసుకుని..విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డాక్టర్లను కోరారు. మరోవైపు హాస్టల్లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. నాణ్యమైన భోజనం అందటం లేదని ఆరోపిస్తున్నారు.