కేయూ స్టూడెంట్లపై పోలీసుల దౌర్జన్యం!.. కాళ్లు, చేతులు ఇరగ్గొట్టిన్రు

కేయూ  స్టూడెంట్లపై పోలీసుల దౌర్జన్యం!.. కాళ్లు, చేతులు ఇరగ్గొట్టిన్రు
  • ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ఇతర సెక్షన్ల కింద కేసులు
  • అరెస్ట్ చేసి టాస్క్​ఫోర్స్ ఆఫీస్​కు తరలింపు
  • ఇష్టమున్నట్టు కొట్టడంతో పలువురికి గాయాలు
  • మెడికల్ రిపోర్టులు మార్చి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
  • జడ్జి ఎదుట గోడు వెళ్లబోసుకున్న స్టూడెంట్స్
  • రీ మెడికల్ టెస్టుకు ఆదేశించిన కోర్టు

హనుమకొండ/ హసన్ పర్తి, వెలుగు :  కేయూలో పీహెచ్​డీ అక్రమాలపై విచారణ జరిపించాలని మంగళవారం ఆందోళన చేపట్టిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు ఇష్టమున్నట్టు చితకబాదారు. తర్వాత మెడికల్ రిపోర్టులు మార్చి జిల్లా కోర్టులో హాజరు పరచగా, పోలీసులు తమను కొట్టారని, కొందరి ఆరోగ్యం బాగా లేకున్నా మెడికల్ రిపోర్టు మార్చారని జడ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. దీంతో జడ్జి రీ మెడికల్ టెస్ట్ కు ఆదేశించగా విద్యార్థులను ఎంజీఎం దవాఖానకు తరలించారు. దీంతో నలుగురు విద్యార్థులకు గాయాలైన విషయం వాస్తవమేనని నిర్ధారించిన డాక్టర్లు వారికి కట్లు కట్టి పంపించారు.  

అసలేం జరిగిందంటే?

కాకతీయ యూనివర్సిటీ పీహెచ్‌డీ కేట‌గిరీ-–2 అడ్మిష‌న్లలో అవ‌క‌త‌వ‌క‌లు జరిగాయని, విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వర్సిటీకి చెందిన వివిధ విద్యార్థులు, విద్యార్థి సంఘాల లీడర్లు మంగ‌ళ‌వారం కేయూ ప్రిన్సిపాల్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని వారించారు. ఈ క్రమంలో కేయూ ఎస్సై విజయ్ కుమార్ స్టూడెంట్స్ పై చేయి కూడా చేసుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో పాటు స్వల్ప ఘర్షణ జరిగింది. దీంతో ప్రిన్సిపాల్ ఆఫీస్ లోని కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర ఫర్నిచర్ ను కొందరు విద్యార్థి సంఘాల నేతలు ధ్వంసం చేశారు. పోలీసులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విద్యార్థి సంఘాల లీడర్లు మాచర్ల రాంబాబు, గట్టు ప్రశాంత్, అరెగంటి నాగరాజు, అంబాల కిరణ్, అజయ్, శ్రీకాంత్, మధు, కమల్, శంకర్, కుమార్ ను మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని పోలీస్​స్టేష‌న్‌కు త‌ర‌లించారు. 

అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్ ఆఫీసుకు తీసుకెళ్లారు. తిరిగి బుధవారం మధ్యాహ్నం కోర్టులో హాజరు పరిచేందుకు ముందుగా అందరికీ మెడికల్ టెస్టులు చేసి, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని రిపోర్ట్ సబ్మిట్ చేశారు. కాగా, జడ్జి ఎదుట విద్యార్థి నేతలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. టాస్క్​ఫోర్స్​స్టేషన్​లో తమను ఎట్లా పడితే అట్లా కొట్టారని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో జడ్జి రీ మెడికల్ టెస్టుకు అదేశించగా..ఎంజీఎం లో బుధవారం రాత్రి మళ్లీ టెస్టులు చేశారు. ఈ పరీక్షల్లో విద్యార్థి నేతలు రాంబాబు, ప్రశాంత్, శంకర్, నాగరాజుకి తీవ్ర గాయాలైనట్టు తేలింది. మాచర్ల రాంబాబు కుడి చెయ్యి, ఎడమ కాలు ఫ్రాక్చర్ అయ్యాయి. శంకర్ కుడి చెయ్యి విరిగింది. ప్రశాంత్ బొటన వేలుకు గాయం కాగా.. నాగరాజు చెయ్యి బెణికింది. దీంతో అక్కడే అడ్మిట్​ చేయించి చికిత్స చేయిస్తున్నారు.  

గొడ్లను బాదినట్టు బాదారు

తమను టాస్క్ ఫోర్స్  స్టేషన్ కు తీసుకెళ్లి పోలీసులు విచ‌క్షణార‌హితంగా దాడి చేశారని విద్యార్థి సంఘాల నేత‌లు ఆరోపించారు. పీహెచ్‌డీ అడ్మిష‌న్లలో అవ‌క‌త‌వ‌క‌లు జరిగాయ‌ని, త‌మ‌కు అన్యాయం జ‌రిగిందని చెబుతున్నా విన‌కుండా పోలీసులు ఓవ‌ర్ యాక్షన్​ చేశార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు త‌మ‌పై దాడి చేసి గాయ‌ప‌ర్చార‌ని వాపోయారు. ఇప్పటికైనా పీహెచ్‌డీ కేట‌గిరీ-–2 అడ్మిష‌న్ల ప్రక్రియ‌ను నిలిపివేయాల‌ని, అర్హులంద‌రికీ న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని మ‌రింత ఉధృతం చేస్తామ‌ని హెచ్చరించారు.