కెమికల్ గ్యాస్ లీకై 40 మంది విద్యార్థినులకు అస్వస్థత

కెమికల్ గ్యాస్ లీకై  40 మంది విద్యార్థినులకు అస్వస్థత

సికింద్రాబాద్, వెలుగు: సైన్స్ ల్యాబ్ లో ప్రాక్టికల్స్ చేస్తుండగా కెమికల్ గ్యాస్ లీకై 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన ఈస్ట్ మారేడ్ పల్లిలోని కస్బూర్బా గాంధీ బాలికల జూనియర్ కాలేజీలో జరిగింది. శుక్రవారం శుక్రవారం విద్యార్థినులు ఇంటర్​ బ్లాక్‌‌లోని కెమిస్ట్రీ ల్యాబ్‌‌లో  ప్రాక్టికల్స్​చేస్తుండగా ఒక్కసారిగా కెమికల్ గ్యాస్ లీకైంది.  దీంతో ల్యాబ్ లోని 40 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 10 మంది స్పృహ తప్పి ల్యాబ్ లోనే పడిపోయారు. కొందరు స్టూడెంట్లు బయటకు వచ్చి కాలేజీ ఆవరణలో వాంతులు చేసుకోవడంతో స్థానికులు గమనించి వారి దగ్గరికి వెళ్లి విషయం అడిగారు.  ల్యాబ్‌‌లో గ్యాస్​లీకై భరించలేని వాసన వచ్చిందని, దీంతో తమకు వాంతులు అవుతున్నట్లు స్టూడెంట్లు చెప్పారు. అప్రమత్తమైన కాలేజీ ఫ్యాకల్టీ, సిబ్బంది వెంటనే వారిని దగ్గరలోని గీతా నర్సింగ్ హోమ్ కు తరలించారు. 40 మందికి ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్లు అందులో 8 మందిని అడ్మిట్ చేసుకుని మిగతా విద్యార్థినినుల ఇండ్లకు పంపించారు. అయితే, ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే కొందరు మళ్లీ అస్వస్థతకు గురికావడంతో మరో ఏడుగురిని తిరిగి హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం16 మంది గీతా నర్సింగ్ హోంలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.

కెమికల్స్ లీకేజీకి కారణాలను మాత్రం కాలేజీ మేనేజ్ మెంట్ చెప్పట్లేదు. ల్యాబ్​లో టాక్సిక్ గ్యాస్ లీకై ఇలా జరిగినట్లు తెలుస్తోంది. స్టూడెంట్లు ప్రాక్టికల్స్ చేస్తున్న టైమ్ లో కెమికల్స్ కలుపుతుండగా,  రియాక్షన్ వల్ల ఇలా జరిగిందా లేక మరేదైనా కారణమా అనేది తెలియదని.. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  కస్తూర్బా కాలేజీ వద్ద ఎలాంటి ఆందోళనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాలేజీ మెయిన్ గేటును మూసివేశారు. ఈ ఘటనపై స్టూడెంట్ల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు. విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుసుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక, టీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ హాస్పిటల్ కు చేరుకుని స్టూడెంట్లను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులపై  డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

ల్యాబ్‌‌లో గ్యాస్​ లీక్ ​కాలేదు: కాలేజీ మేనేజ్ మెంట్ 

ల్యాబ్‌‌లో ఎలాటి గ్యాస్​లీక్ కాలేదని, బయట ఉన్న చెత్తలో నుంచి విష వాయువులు వచ్చి ఉండొచ్చని.. అవి పీల్చడం వల్లే స్టూడెంట్లు అస్వస్థతకు గురైనట్లు కాలేజీ మేనేజ్ మెంట్ చెబుతోంది. మరోవైపు విష వాయువులు పీల్చడం వల్లే స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారని డాక్టర్లు చెబుతున్నారు. ఎగ్జిబిషన్​సొసైటీ వైస్​ప్రెసిడెంట్ అశ్విన్​పాపయ్య చక్రవర్తి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాలేజీలో ఎలాంటి గ్యాస్ కానీ కెమికల్ లీక్ కాలేదని.. బయట చెత్తకుప్పల నుంచి వెలువడ్డ వాయువులు పీల్చడం ఈ ఘటన జరిగిందని చెప్పారు. కోలుకున్న స్టూడెంట్లను డిశ్చార్జ్  చేసి ఇంటికి పంపిస్తున్నామని పేర్కొన్నారు.