
కామారెడ్డిలో విద్యార్థి సంఘాల ఆందోళన
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా రవాణా శాఖ ఆఫీసు (ఆర్టీవో) ఎదుట సోమవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్లు ధర్నాకు దిగారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలను బెదిరించి బలవంతంగా స్కూల్ బస్సులను నిజామాబాద్‌లో జరిగిన సీఎం సభకు పంపించటాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. టీచర్స్ డే రోజు స్కూల్ బస్సులను బలవంతంగా తీసుకెళ్లి స్టూడెంట్లను ఇబ్బందులకు గురిచేయడం ఎంత వరకు సమంజసమన్నారు. ఆఫీసర్లకు సీఎం మీటింగ్‌పై ఉన్న శ్రద్ధ స్టూడెంట్ల చదువులపై లేదన్నారు. ఎంవీఐ యాక్ట్ ప్రకారం మీటింగ్‌కు తీసుకెళ్లిన స్కూల్ బస్సులపై చర్యలు తీసుకోవాలన్నారు. బీడీఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ ఆజాద్, ఎన్ఎస్‌యూఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, టీజేఎస్, బీసీవీఎస్ జిల్లా ప్రెసిడెంట్లు ఐరేని సందీప్, అరుణ్, సురేశ్, లక్ష్మణ్‌యాదవ్, నీల నాగరాజు, విఠల్, నరేందర్, ప్రవీణ్ పాల్గొన్నారు.
నిరుద్యోగ భృతి అందించాలి
కమ్మర్‌పల్లి, వెలుగు: కేసీఆర్ 2018లో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులందరికీ నిరుద్యోగ భృతి చెల్లించాలని బీజేవైఎం లీడర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కమ్మర్‌పల్లి, భీంగల్ మండలాల తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన తెలిపి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు లీడర్లు మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి మూడేళ్లు దాటినా ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో అర్హులైన వారికి ఆసరా, బీడీ కార్మికుల పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా మండలాల బీజేపీ, బీజేవైఎం లీడర్లు పాల్గొన్నారు.
నిమజ్జనంలో అపశ్రుతి చెరువులో మునిగి యువకుడి మృతి
పిట్లం, వెలుగు: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెల్ చెరువులో సోమవారం నిర్వహించిన గణేశ్ నిమజ్జనంలో గ్రామానికి చెందిన గాండ్ల రవి (28) పాల్గొన్నాడు. చెరువు వద్ద నిర్వహించిన వేలంలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నాడు. స్నానం చేసి ప్రసాదం తీసుకోవడానికి చెరువులోకి దిగడంతో అందులో మునిగి చనిపోయాడు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై లింబాద్రి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
గణేశ్ మండపాలకు బియ్యం పంపిణీ
ఆర్మూర్, వెలుగు: బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు పొద్దుటూరి వినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్, మామిడిపల్లి, పెర్కిట్‌లోని గణేశ్ మండపాలకు సోమవారం బియ్యం పంపిణీ చేశారు. అన్నదానం నిర్వహణ కోసం మొత్తం 250 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేసినట్లు వినయ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కొంతం మురళీధర్, రాజు, కిరణ్, భూపేందర్ పాల్గొన్నారు.
ఎల్ఐసీ ఎదుట ఏజెంట్ల ధర్నా
కామారెడ్డి, వెలుగు: ఎల్ఐసీ ఏజెంట్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కామారెడ్డి ఎల్ఐసీ ఆఫీసు ఎదుట ఏజెంట్ల సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆఫీసు ముందు బైఠాయించి ఎజెంట్స్ రెస్ట్ డేగా నిరసన జరిపారు. ఇన్సూరెన్స్ పాలసీపై జీఎస్టీ రద్దు చేయాలని, పాలసీ లోన్‌పై వడ్డీ రేట్లు తగ్గించాలని, ఏజెంట్లకు గ్రూప్ మెడికల్ పాలసీ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో ఆందోళన నిర్వహించారు. లియాఫీ బ్రాంచ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు కొండా భైరయ్య, కదం నారాయణ్ రావు, ట్రెజరర్ పప్పుల అంజన్‌కుమార్, ప్రతినిధులు కిషోర్చందు, జయసింహారెడ్డి, శంకర్, రాజిరెడ్డి, శేఖర్, రమేశ్, పరంధాములు, శ్రీనివాస్, చంద్రశేఖర్‌రెడ్డి, రాజేందర్, ఆశోక్, శ్రీకాంత్‌రావు పాల్గొన్నారు.
డిగ్రీ ఫలితాలు విడుదల
డిచ్‌పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అన్ని కాలేజీలకు చెందిన డిగ్రీ సీబీసీఎస్ ఆరో సెమిస్టర్ ఫలితాలను వీసీ రవీందర్‌గుప్తా సోమవారం ఆయన ఛాంబర్‌లో విడుదల చేశారు. ఈ ఎగ్జామ్స్‌కు 7,979 మంది స్టూడెంట్స్ హాజరు కాగా 3,348 మంది పాస్ అయ్యారని తెలిపారు. పాస్ పర్సెంటేజ్ 44.47 శాతంగా నమోదైనట్లు చెప్పారు. రిజిస్ట్రార్ విద్యావర్ధిని, సీవోఈ అరుణ, నీలిమా, మహేందర్‌రెడ్డి, జ్యోతి పాల్గొన్నారు.
టీయూకు ఐఎస్వో టీం
టీయూలో సోమవారం ఇంటర్నేషన్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ టీం పర్యటించింది వర్సిటీలోని డిపార్ట్మెంట్లు, వసతులు, నాణ్యత ప్రమాణాలు చెక్ చేశారు. స్టాండర్డ్స్ఆధారంగా వర్సిటీ కి ర్యాంకింగ్స్ ఇస్తారని వీసీ చెప్పారు. టీం డైరెక్టర్ శివయ్య మనోహర్, డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ సుందర రామయ్య పాల్గొన్నారు.
సీఎం పర్యటనతో ఒరిగిందేమి లేదు
కామారెడ్డి, వెలుగు: సీఎం కేసీఆర్ పర్యటనతో ఉమ్మడి నిజామాబాద్‌జిల్లాకు ఒరిగిందేమి లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్‌అలీ ఓ ప్రకటనలో అన్నారు. సోమవారం సీఎం కేసీఆర్ నిజామాబాద్‌కు వచ్చిన సందర్భంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఏమైనా వరాలు ప్రకటిస్తారని ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూశారన్నారు. సీఎం పర్యటన ప్రజల కోసం కాకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే విధంగా జరిగిందన్నారు. టీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు అనిపిస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ( ప్రాణహిత- చేవేళ్ల)కు సంబంధించి ప్యాకేజీలకు సంబంధించి నయాపైసా ప్రకటన చేయలేదన్నారు. వీఆర్‌ఏలు 45 రోజులుగా సమ్మె చేస్తున్నారని, బొల్లారం చెందిన వీఆర్‌ఏ ఆశోక్ ఆత్మహత్య కూడా చేసుకున్నాడని.. కానీ వీరి విషయంలో కూడా ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు.
సీఎం సభకు తరలిన టీఆర్ఎస్ శ్రేణులు
కామారెడ్డి , వెలుగు: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు కామారెడ్డి జిల్లా నుంచి టీఆర్ఎస్ శ్రేణులు, డ్వాక్రా మహిళలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, జుక్కల్ నియోజక వర్గాల నుంచి బస్సుల్లో ప్రజాప్రతినిధులు, లీడర్లు, కార్యకర్తలు వెళ్లారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్ధీన్ కామారెడ్డిలో జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.
ఘనంగా కుంకుమార్చనలు
కామారెడ్డి , వెలుగు: వినాయక ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు గణేశ్ మండపాల వద్ద సోమవారం ఘనంగా కుంకుమార్చనలు చేశారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నరు
బోధన్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పీడీఎస్‌యూ, ఐఎఫ్టీయూ, పీవైఎల్ నాయకులకు ఆరెస్టు చేయడం సరికాదని ఐఎఫ్టీయూ జిల్లా కోశాధికారి ధాల్‌మాల్క్ పోశెట్టి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు పాల్గొన్నారు.