టీచర్ లేని బడులు..  ఆగమవుతున్న సదువులు

టీచర్ లేని బడులు..  ఆగమవుతున్న సదువులు

టీచర్లు లేక సర్కారు బడుల్లో పిల్లల చదువులు ఆగమవుతున్నాయి. స్కూళ్లు తెరిచి పది రోజులు అవుతున్నా పాఠాలు చెప్పేవారు లేక పిల్లలు ఆటలతో కాలం గడుపుతున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం బడుల పరిస్థితి ఇదీ..

ఈ ఫోటోలో కనిపిస్తున్న షెడ్డు ఆదిలాబాద్ రూరల్ మండలం అసోదా గ్రామ పంచాయతీ బుర్కి గూడెంలోనిది. కూన పెంకులతో నిర్మించిన ఈ షెడ్డే ఆ ఊరి ప్రైమరీ స్కూల్. ఈ బడి టీచర్ ​గతేడాది ట్రాన్స్​ఫర్​ అయ్యారు. కొత్తవారు ఎవరూ రాలేదు. స్కూల్​లో ఉన్న 20 మంది స్టూడెంట్లకు గూడెంలో ఉన్న ఓ మహిళ ఇలా చదువులు చెబుతూ కనిపించింది.

ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘట్ గ్రామ పంచాయతీలోని గుండంలొద్ది ట్రైబల్ వెల్ఫేర్ ప్రైమరీ స్కూల్​ ఇది. ఈ స్కూల్​టీచర్ గత సంవత్సరం వాలంటరీ రిటైర్మెంట్ ​తీసుకున్నారు. ఇప్పటివరకు ఆయన ప్లేస్​లో మరొకరిని నియమించలేదు. స్కూల్​లో 15 మంది స్టూడెంట్లు ఉన్నారు. విద్యా సంవత్సరం మొదలైనా స్కూల్​ తెరవకపోవడంతో వారంతా చదువులకు దూరం అవుతున్నారు.


– వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంకొలి గ్రామ పంచాయతీ పరిధిలోని కోలం గూడెంలోని బడి ఇది. ఈ ట్రైబల్ వెల్ఫేర్ ప్రైమరీ స్కూల్​లో దాదాపు 20 మంది స్టూడెంట్లు ఉన్నా టీచర్ లేడు. దాంతో బడి తాళం తీయకపోవడంతో పిల్లలు ఇలా స్కూల్ బయట ఆడుకుంటున్నారు. గూడెం వాసులను అడగ్గా గత ఏడాది ఇక్కడున్న టీచర్ ట్రాన్స్​ఫర్​ అయ్యారని, ఇప్పటివరకు మరో టీచర్ ను కేటాయించలేదని వాపోతున్నారు.

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గోప్యాతండాలోని ప్రభుత్వ స్కూల్​టీచర్​ గతేడాది ట్రాన్స్​ఫర్ ​అయ్యారు. కొత్త టీచర్​ను నియమించలేదు. స్కూల్స్​ మొదలై పది రోజులు దాటుతున్నా ఈ బడి గురించి ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. దీంతో స్కూల్​లో పది మందికి పైగా ఉన్న స్టూడెంట్లు నిత్యం ఆటలతో గడిపేస్తున్నారు. ఆఫీసర్లను అడిగితే కొద్ది రోజుల్లో నియమిస్తామని చెబుతున్నారే తప్ప పట్టించుకోవడం లేదని తండావాసులు వాపోతున్నారు.– రాయపర్తి, వెలుగు