గోల్డ్​చైన్​ వేస్కుని స్కూలుకు వచ్చినందుకు స్టూడెంట్లకు టీసీలిచ్చిన్రు

గోల్డ్​చైన్​ వేస్కుని  స్కూలుకు వచ్చినందుకు స్టూడెంట్లకు టీసీలిచ్చిన్రు

జనగామ, వెలుగు: జనగామలోని ధర్మకంచ హైస్కూల్​లో హెచ్​ఎం ​ఇద్దరు స్టూడెంట్లకు టీసీలు ఇవ్వడం వివాదాస్పదమైంది. గోల్డ్ చైన్​ వేసుకుని స్కూలుకు వచ్చినందుకు హెచ్ఎం టీసీలు ఇచ్చి పంపించేశారని బాలికలు ఆరోపించగా, వాళ్లు అడిగితేనే టీసీలు ఇచ్చామని హెచ్ఎం చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో బాలికలిద్దరూ సోమవారం జిల్లా అడిషనల్ ​కలెక్టర్​ రోహిత్​సింగ్​ను కలిసి హెచ్ఎంపై ఫిర్యాదు చేశారు.

 ఆయన సమగ్ర విచారణ జరిపాలని డీఈఓ రామును ఆదేశించారు. బాధిత బాలికలు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామకు చెందిన పి.సమిత, సారిక కవలలు. స్థానిక హైస్కూల్​లో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గత శుక్రవారం సమిత, సారిక మెడలో బంగారు గొలుసులు వేసుకుని స్కూలుకు వెళ్లగా, టీచర్​మందలించి హెడ్​మాస్టర్​స్వర్గం ప్రకాశం వద్దకు తీసుకెళ్లారు. హెచ్ఎం బాలికలపై కోప్పడి, వెంటనే వెళ్లి మీ పేరెంట్స్​ను తీసుకురావాలని చెప్పాడు. 

చిన్నారులు ఇద్దరూ ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మను తీసుకొచ్చారు. ఆమెపై కూడా హెచ్ఎం కోప్పడడంతో టీసీలు ఇచ్చేయండి అనగా.. హెచ్ఎం ఇచ్చేశారని బాలికలు వాపోయారు. ఈ విషయమై హెచ్ఎం ప్రకాశంను వివరణ కోరగా బాలికలు ఇద్దరూ ఇర్రెగ్యులర్​స్టూడెంట్లని చెప్పారు. స్కూలుకు రాకుండా ఉంటే ఎలా అని ప్రశ్నించగా, మర్యాద లేకుండా మాట్లాడారని తెలిపారు. శుక్రవారం బాలికల తల్లి వచ్చి లిఖిత పూర్వకంగా టీసీ ఇవ్వాలని అడిగితేనే తాము ఇచ్చామని వెల్లడించారు. అవసరమైతే స్కూల్​సీపీ పుటేజీలను పరిశీలించవచ్చునన్నారు.