సడన్​ డెత్స్​పై స్టడీ.. కరోనా తర్వాత పెరిగిన కార్డియాక్ అరెస్ట్‌ కేసులు

సడన్​ డెత్స్​పై స్టడీ.. కరోనా తర్వాత పెరిగిన కార్డియాక్ అరెస్ట్‌ కేసులు
  • దీనికి గల కారణాలు తెలుసుకునే పనిలో సైంటిస్టులు 
  • దేశవ్యాప్తంగా 40 దవాఖాన్లలో రీసెర్చ్‌ చేస్తున్న ఐసీఎంఆర్ 
  • లోక్‌సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయా వెల్లడి

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా నమోదవుతున్న సడెన్ కార్డియాక్ అరెస్ట్ డెత్స్‌‌‌‌పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా తర్వాత సడన్ కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరిగిన మాట వాస్తవమేనని, అయితే ఇందుకు కరోనా కారణమా, మరేదైనా ఉందా? అనే విషయం తెలియదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌‌‌‌సుఖ్‌‌‌‌ మాండవీయ లోక్‌‌‌‌సభలో ప్రకటించారు. ఇదే విషయంపై దేశవ్యాప్తంగా 40 హాస్పిటల్స్‌‌‌‌లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌‌‌‌‌‌‌‌) ఆధ్వర్యంలో పరిశోధన జరుగుతోందని వెల్లడించారు.

18 ఏండ్ల నుంచి 45 ఏండ్ల మధ్య వయసున్న వ్యక్తులు కార్డియాక్ అరెస్టుకు గురవడానికి గల కారణాలను ఈ పరిశోధన ద్వారా తెలుసుకునేందుకు సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారని ఆయన వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరో రెండు రకాల స్టడీస్‌‌‌‌ కూడా జరుగుతున్నాయని వెల్లడించారు. రక్తం గడ్డ కట్టడానికి కరోనా వైరస్‌‌‌‌, వ్యాక్సిన్‌‌‌‌కు ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు కూడా ఓ స్టడీ జరుగుతోందని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతున్నట్టు అప్పట్లో డాక్టర్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తాన్ని పలుచబరిచే మందులు వాడాలని కూడా సూచించారు. ఈ స్డడీ దేశవ్యాప్తంగా 30 దవాఖాన్లలో జరుగుతోందని మాండవీయ వివరించారు. సడన్ కార్డియాక్ అరెస్ట్‌‌‌‌తో చనిపోయిన వారి అటాప్సీ రిపోర్ట్‌‌‌‌లను పరిశీలించడం ద్వారా మరణాలకు గల కారణాన్ని తెలుసుకునేందుకు మరో స్టడీ జరుగుతోందని ఆయన వెల్లడించారు.