ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం .. ఇత‌‌ర రాష్ట్రాల్లో స్టడీ

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం .. ఇత‌‌ర రాష్ట్రాల్లో స్టడీ
  •  అధికారులను పంపించాలని హౌజింగ్ శాఖకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు
  • న‌‌మూనా, ల‌‌బ్ధిదారుల ఎంపికపై వివరాలు సేకరించాలని సూచన

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం.. ఇత‌‌ర రాష్ట్రాల్లో పేద‌‌ల‌‌కు అక్కడి ప్రభుత్వాలు నిర్మిస్తున్న ఇండ్లపై అధ్యయ‌‌నం చేయించాలని సర్కారు నిర్ణయించింది. ముఖ్యంగా ఇండ్ల న‌‌మూనాలు, ల‌‌బ్ధిదారుల అర్హతలు, ఎంపిక విధానం త‌‌దిత‌‌ర అంశాలు తెలుసుకోవాలని భావిస్తున్నది. ఈ మేరకు అధికారుల‌‌ను ఇతర  రాష్ట్రాలకు పంపించాలని డిప్యూటి సీఎం భ‌‌ట్టి విక్రమార్క హౌజింగ్ శాఖను ఆదేశించారు. 

పూర్తి స్థాయిలో అధ్యయ‌‌నం చేయించి త్వర‌‌గా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల‌‌ని ఆయన సూచించారు. సోమ‌‌వారం సెక్రటేరియెట్​లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో క‌‌లిసి హౌజింగ్‌‌, రెవెన్యూ, ఐ అండ్ పీఆర్ శాఖ‌‌ల అధికారుల‌‌తో బ‌‌డ్జెట్ ప్రతిపాద‌‌న‌‌ల‌‌పై భట్టి స‌‌మీక్షించారు. త‌‌మిళ‌‌నాడు రాష్ట్రంలోని చెన్నై, క‌‌ర్నాట‌‌క‌‌లోని బెంగ‌‌ళూరు, మ‌‌హారాష్ట్రలోని ముంబై న‌‌గ‌‌రాల‌‌కు హౌజింగ్ శాఖ అధికారులు వెళ్లి.. అక్కడి ఇండ్ల నిర్మాణంపై స‌‌మ‌‌గ్రంగా అధ్యయ‌‌నం చేయాలని సూచించారు. 

ఈసారి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి నియోజ‌‌క‌‌వ‌‌ర్గంలో 3,500 ఇండ్ల చొప్పున‌‌ నిర్మించేందుకు బ‌‌డ్జెట్‌‌లో నిధులు కేటాయించింద‌‌న్నారు. ప్రభుత్వం అమ‌‌లు చేసే ఆరు గ్యారంటీల అమ‌‌లులో భాగ‌‌మే ఇందిర‌‌మ్మ ఇండ్ల నిర్మాణమ‌‌ని ఆయన పేర్కొన్నారు. ఇందిర‌‌మ్మ ఇండ్లకు సోలార్ విద్యుత్ ఏర్పాటు త‌‌ప్పనిస‌‌రి అని ప్రభుత్వం భావిస్తున్నద‌‌ని చెప్పారు. ఇండ్ల నిర్మాణ స‌‌మ‌‌యంలో క‌‌చ్చితంగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే విధంగా చ‌‌ర్యలు తీసుకోవాల‌‌ని అధికారుల‌‌కు భట్టి సూచించారు.

ఓఆర్ఆర్, ట్రిపుల్​ఆర్​ చుట్టూ ఇండ్ల నిర్మాణం

రాష్ట్ర రాజ‌‌ధాని హైద‌‌రాబాద్ మ‌‌హాన‌‌గరం శ‌‌ర వేగంగా అభివృద్ధి చెందుతున్న నేప‌‌థ్యంలో ఓఆర్​ఆర్, ట్రిపుల్​ఆర్​ చుట్టూ ఇండ్ల నిర్మాణంపై హౌజింగ్ శాఖ దృష్టి సారించాల‌‌ని భట్టి సూచించారు. ఇందుకోసం రెవెన్యూ శాఖ నుంచి భూమిని సేకరించుకోవాలన్నారు. గ‌‌త ప్రభుత్వంలో జ‌‌రిగిన డ‌‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల గురించి ఆరా తీశారు. ఇప్పటి వ‌‌ర‌‌కు నిర్మాణ‌‌మైన ఇండ్లు, ఇంకా పూర్తి కావాల్సిన ఇండ్ల వివరాల‌‌ను అడిగి తెలుసుకున్నారు. 

జీహెచ్ఎంసీ ప‌‌రిధిలో గ‌‌త ప్రభుత్వం ల‌‌క్ష ఇండ్ల నిర్మాణం ల‌‌క్ష్యంగా పెట్టుకొని 69 వేల ఇండ్లను మాత్రమే పూర్తి చేసి.. 65 వేల ఇండ్లను ల‌‌బ్ధిదారుల‌‌కు పంపిణీ చేసింద‌‌ని అధికారులు వివ‌‌రించారు. మిగ‌‌తా ఇండ్ల నిర్మాణ ప్రక్రియ కొన‌‌సాగుతోంద‌‌ని చెప్పారు. అలాగే, ధ‌‌ర‌‌ణి పెండింగ్ ద‌‌ర‌‌ఖాస్తుల గురించి భట్టి ఆరా తీశారు. డిజిట‌‌ల్ భూ స‌‌ర్వే చేయ‌‌డానికి  నిధులు ఇవ్వాల‌‌ని డిప్యూటీ సీఎంను అధికారులు కోరారు. ఈ స‌‌మావేశంలో ఫైనాన్స్ స్పెష‌‌ల్ చీఫ్ సెక్రట‌‌రీ రామ‌‌కృష్ణారావు, ప్రిన్సిప‌‌ల్ సెక్రట‌‌రీలు సందీప్ సుల్తానియా, నవీన్ మిట్టల్‌‌ తదితరులు పాల్గొన్నారు.