సగం ఫీజు కడితేనే స్టడీ మెటీరియల్ ​

సగం ఫీజు కడితేనే స్టడీ మెటీరియల్ ​
  • తమ దగ్గరే కొనాలంటూ పేరెంట్స్​కు ప్రైవేట్​ కాలేజీల మెసేజ్​లు
  •  బహిరంగ మార్కెట్​లో దొరకని పుస్తకాలు
  • స్టూడెంట్స్​, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళన  
  •  జులై ఫస్ట్​ నుంచి ఇంటర్​ తరగతులు షురూ

ఎస్ ఆర్ నగర్​లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంపీసీలో జాయిన్ అయ్యా. కాలేజీ లోనే స్టడీ మెటీరియల్ తీసుకున్నా.  నాలుగు సబ్జెక్ట్​లకు సంబంధించినవి మాత్రమే ఇచ్చారు. మిగిలినవి షార్టేజ్ ఉన్నాయని.. వచ్చాక ఇస్తామన్నారు. అయితే అడ్మిషన్ కోసం నాన్నతో  వెళ్లినప్పుడు మొత్తం ఫీజులో 40 పర్సెంట్ కడితేనే మెటిరియల్ ఇస్తామని మేనేజ్​మెంట్​ చెప్పింది. దీంతో పాటు మెటీరియల్ కి ఐదు వేలు కట్టాలని తెలిపింది. అంత అమౌంట్ కట్టాలంటే ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది” అని 
ఇంటర్​ ఫస్టియర్ స్టూడెంట్ విష్ణు తెలిపాడు. 

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ కాలేజ్ స్టూడెంట్లకు స్టడీ మెటీరియల్ తిప్పలు షురూ అయినయ్.  జులై నుంచి కాలేజీలు స్టార్ట్ అవుతుండగా అప్పుడే స్టూడెంట్లలో ఆందోళన మొదలైంది. ఇంటర్ ఫస్ట్ ,సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కాలేజీల్లోనే ఇస్తున్నామని మేనేజ్​మెంట్లు చెప్తున్నా.. పూర్తి మెటీరియల్స్ అందుబాటులో లేవు. అయితే స్టూడెంట్లు ఫీజు చెల్లించాక పూర్తి మెటీరియల్​లో కొన్ని సబ్జెక్ట్​లకు సంబంధించినవి మాత్రమే ఇస్తున్నాయి.  ఎంపీసీలో 26 స్టడీ మెటీరియల్స్ ఉంటే అందులో నాలుగు మాత్రమే ఇచ్చి మిగతావి లేవని చెప్తున్నాయి. మిగిలినవి  విడతల వారీగా ఇస్తామంటున్నాయి. ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ, బైపీసీ ఇలా అన్ని గ్రూప్​లకు చెందిన స్టూడెంట్స్​ది ఇదే పరిస్థితి. చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్​ కాలేజీల్లో మేనేజ్ మెంట్లు సొంత మెటీరియల్ ప్రిపేర్ చేస్తున్నాయి. బయట మార్కెట్​లో తీసుకోవద్దని, తమ వద్దే తీసుకోవాలని పేరెంట్స్​కి మెసేజ్​లు పంపిస్తున్నాయి. పూర్తి ఫీజులో 20 నుంచి 40శాతం కట్టిన తర్వాత మాత్రమే మెటీరియల్​ని అందిస్తామని చెప్తున్నాయి. దీంతో కొనక తప్పని పరిస్థితి కావడంతో పేరెంట్స్ ముందే చెల్లిస్తున్నారు. కాలేజ్ ఫీజుతో పాటు మెటీరియల్​కి రూ. 3 నుంచి 5 వేలు వసూలు చేస్తున్నాయి. కొన్ని కాలేజీలు తమ వద్ద మెటీరియల్ లేదని మార్కెట్ లోనే కొనుక్కోవాలని సూచిస్తున్నాయి. 
70 శాతం సిలబస్‌‌తోనే క్లాసులు 
రాష్ట్రంలో జులై 1 నుంచి ఇంటర్‌‌ తరగతులు ప్రారంభమవుతాయని ఇంటర్మీడియట్ ​బోర్డు కార్యదర్శి ఉమర్‌‌ జలీల్‌‌ రెండ్రోజుల క్రితం తెలిపారు. స్టూడెంట్స్​కు ఒకరోజు ఫిజికల్ క్లాసులు, మరో రోజు ఆన్‌‌లైన్‌‌ ఉంటాయని పేర్కొన్నారు. జులై 1న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్​కి,  2న సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి క్లాసులు స్టార్ట్​ అవుతాయని తెలిపారు. విద్యా సంవత్సరం మొత్తం ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌‌లైన్​లోనూ నిర్వహిస్తామని చెప్పారు.  ఈ నెల 25 నుంచి లెక్చరర్లు కాలేజీలకు రావాలని ఆదేశించారు. 70 శాతం సిలబస్‌‌తోనే ఈ ఏడాది నిర్వహించే యోచనలో ఉన్నామన్నారు. ఇంటర్‌‌ ఫస్ట్‌‌ ఇయర్‌‌ ఆధారంగా సెకండ్‌‌ ఇయర్‌‌ స్టూడెంట్స్​కు
 మార్కులు కేటాయిస్తామన్నారు. 
ఎక్కువ రేటుకి కొన్నాం 
మా అమ్మాయి ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఎంఈసీలో జాయినైంది. ఫస్ట్ ఇయర్​కి సంబంధించి పుస్తకాల కోసం కాలేజ్ మేనేజ్​మెంట్​ను అడిగితే  బయటే తీసుకోవాలని చెప్పింది. షాపుల్లో అడిగితే ఎంఈసీ మెటీరియల్ షార్టేజ్ ఉందని చెప్పారు. తెలిసిన వాళ్ల ద్వారా తెప్పిస్తే
మెటీరియల్స్ కాస్ట్ రూ. 600 అయితే రూ.వెయ్యి  తీసుకున్నారు.                                                                           - రాము, పేరెంట్, సికింద్రాబాద్ 
బుక్స్​ లేకుండనే ఆన్​లైన్​ క్లాసులు
మా అబ్బాయిని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ గ్రూప్​లో జాయిన్ చేశాం. కాలేజ్ మేనేజ్​మెంట్​ ఫీజు రూ. 50 వేలని చెప్పి, అడ్మిషన్ ఫీజు రూ. 3 వేలు తీసుకుంది. ఈ నెల మొదటివారం నుంచే ఆన్​లైన్ ​క్లాసులు ప్రారంభించారు. ఇంతవరకు ఎలాంటి మెటీరియల్ ఇవ్వలేదు. లెక్చరర్లు బోర్డ్ మీద చెప్తుంటే నోట్స్ రాసుకుంటున్నాడు. స్టడీ మెటీరియల్ బయట తీసుకుందామంటే, కాలేజీలోనే ఇస్తామని, ఓపెన్ అయ్యాకే తీసుకోవాలని చెప్పింది. మెటీరియల్ లేకుండా నోట్స్ రాసుకుని చదవడం అబ్బాయికి కష్టంగా ఉంది.                                                                                                                       - అనిత,పేరెంట్, కొత్తపేట్