పోలవరం ముంపుపై సీడబ్ల్యూసీ స్టడీ

పోలవరం ముంపుపై సీడబ్ల్యూసీ స్టడీ
  • ముంపు రాష్ట్రాల జాయింట్ కమిటీ మీటింగ్​లో నిర్ణయం
  • 2021 ఫిబ్రవరి చివరి నాటికి కమిషన్​ నివేదిక
  •  పోలవరం ఆయకట్టు  7.2 లక్షల ఎకరాలేనన్న ఏపీ

హైదరాబాద్‌‌, వెలుగు: పోలవరం ప్రాజెక్టు కెపాసిటీ పెంపుతో తలెత్తే ముంపు ప్రభావంపై సెంట్రల్​ వాటర్ కమిషన్​​  (సీడబ్ల్యూసీ)తో స్టడీ చేయించాలని ముంపు రాష్ట్రాల జాయింట్‌‌ కమిటీ మీటింగ్​లో నిర్ణయించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సీడబ్ల్యూసీ స్టడీకి సహకరించాలని.. తమ వద్ద ఉన్న నివేదికలను సీడబ్ల్యూసీకి అందజేయాలని చెప్పారు. సెంట్రల్‌‌ పొల్యూషన్‌‌ బోర్డు (సీపీసీబీ) చెన్నై రీజినల్‌‌ డైరెక్టర్‌‌ ఆధ్వర్యంలో అక్టోబర్‌‌ 14న నిర్వహించిన సమావేశం వివరాలను శుక్రవారం వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), జలశక్తి శాఖ అధికారులు, సీడబ్ల్యూసీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌‌గఢ్‌‌, ఆంధ్రప్రదేశ్‌‌ ప్రభుత్వ అధికారులు ఆ మీటింగ్​లో పాల్గొన్నారు. నవంబర్‌‌ 15లోగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి ప్రతిపాదనతో పాటు అన్ని వివరాలు సీడబ్ల్యూసీకి అందజేయాలని మీటింగ్​లో నిర్ణయించారు. పోలవరం కెపాసిటీ పెంపుపై వచ్చే యేడాది ఫిబ్రవరి 28లోగా సీడబ్ల్యూసీ స్టడీ చేసి రిపోర్టు అందజేయాలన్నారు.

మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి లేఖతో..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌‌రెడ్డి పోలవరం కెపాసిటీ పెంపుపై నేషనల్​గ్రీన్​ ట్రిబ్యునల్​ (ఎన్జీటీ) కి రిప్రజంటేషన్‌‌ సమర్పించారు. పోలవరం స్పిల్‌‌ వే డిశ్చార్జి కెపాసిటీని 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షలకు పెంచడంతో తమ రాష్ట్రంలోని భద్రాచలం రామాలయంతో పాటు మణుగూరు హెవీ వాటర్‌‌ ప్లాంట్‌‌ మునుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన అభ్యర్థనను సుమోటోగా తీసుకున్న ఎన్జీటీ.. దానిపై స్టడీకి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదికలో ప్రస్తావించిన 8 అంశాలపై తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రాల్లో భయాందోళనలు నెలకొన్నట్టు గుర్తించామంది. వాటిపై చర్చించి పరిష్కరించడానికి జాయింట్‌‌ మీటింగ్‌‌ నిర్వహించాలని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు తొలి జాయింట్‌‌ కమిటీ సమావేశం నిర్వహించారు.

పోలవరంతో భద్రాచలం మునుగుతది

పోలవరం కెపాసిటీ పెంపుతో భద్రాచలం పట్టణం మునిగిపోతుందని సమావేశంలో తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. భద్రాచలం వద్ద గోదావరిలో 45.72 మీటర్ల ఎత్తులో నిలుస్తాయని, కిన్నెరసానిలోనూ నీళ్లు ఆగి ఎగువ ప్రాంతాలు మునుగుతాయంది. ప్రాజెక్టు కెపాసిటీ పెంపుతో తలెత్తే ముంపు సమస్యపై సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీతో స్టడీ చేయిస్తే తమకు సమ్మతమేనని చెప్పింది. పోలవరం కెపాసిటీ పెంపుతో ఒడిశాలో 6,316 మంది, ఛత్తీస్‌‌గఢ్‌‌లో 11,766 మంది నిర్వాసితులవుతున్నారని.. వారికి వెంటనే పరిహారం, ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ ప్యాకేజీ అందించాలని ఆ రాష్ట్రాలు కోరాయి. ఏపీ సీఎస్‌‌ స్పందిస్తూ తెలంగాణ, ఏపీలోనే భూసేకరణ కోసం పబ్లిక్‌‌ హియరింగ్‌‌ నిర్వహించామని.. ఒడిశా, ఛత్తీస్‌‌గఢ్‌‌లో ఇంకా సమావేశాలు జరగలేదని తెలిపారు. దీనికి ఆ రెండు రాష్ట్రాల ప్రతినిధులు త్వరలోనే హియరింగ్‌‌ నిర్వహిస్తామన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 371 ముంపు గ్రామాల్లో నిర్వాసితులకు 6 నెలల్లో పరిహారం, ఆర్‌‌ అండ్‌‌ ఆర్‌‌ ప్యాకేజీ ఇవ్వాలని ఎన్జీటీ చెప్పగా అంత తక్కువ టైమ్​లో కష్టమని ఏపీ చెప్పింది. పోలవరం ప్రాజెక్టు ఆయకట్టు 7.2 లక్షల ఎకరాల నుంచి 15 లక్షల ఎకరాలకు పెంచలేదంది. పట్టిసీమ, పురుషోత్తమపట్నం, చింతలపూడి లిఫ్ట్‌‌ స్కీంల కింద ఆయకట్టును పోలవరం ఆయకట్టుతో కలిపి చూడొద్దని చెప్పింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు తదుపరి సమావేశాలు నిర్వహించి పోలవరంతో తలెత్తే పర్యవసానాలపై చర్చించి పరిష్కరించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.

ఏపీ, కర్నాటక ప్రాజెక్టులు ఆపండి

తుంగభద్ర రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డుకు తెలంగాణ లెటర్​

తుంగభద్రపై అక్రమ ప్రాజెక్టులు కట్టాలని ప్రయత్నిస్తున్న ఏపీ, కర్నాటక ప్రభుత్వాలను నిలువరించాలని తుంగభద్ర రివర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బోర్డును రాష్ట్ర సర్కారు కోరింది. ఈ విషయమై ఇరిగేషన్‌‌ ఈఎన్సీ మురళీధర్‌‌ శుక్రవారం తుంగభద్ర బోర్డు చైర్మన్‌‌కు లెటర్‌‌ రాశారు. ‘ఏపీ ప్రభుత్వం తుంగభద్ర హై లెవల్‌‌ కెనాల్‌‌కు సమాంతరంగా వరద కాలువ తవ్వి 25 టీఎంసీలను మళ్లించడానికి కొత్త ప్రాజెక్టును ప్రతిపాదించింది. హెచ్‌‌ఎల్సీకి సమాంతరంగా 12 వేల క్యూసెక్కుల కెపాసిటీతో 200 కి.మీ. కాలువ తవ్వాలని బోర్డును కోరుతోంది. తుంగభద్రలో వరద ఉండే 20 రోజుల్లో మళ్లించే 25 టీఎంసీలను ఏపీ, కర్నాటక ఉపయోగించుకోవాలని ఏపీ సూచిస్తోంది. మరోవైపు కర్నాటక సర్కారు తుంగభద్ర రిజర్వాయర్‌‌ కుడి కాలువకు సమాంతరంగా రోజుకు 2 టీఎంసీలను తరలించేలా కొత్త కాలువతో పాటు ఓ బ్యాలెన్సింగ్‌‌ రిజర్వాయర్ కట్టాలనుకుంటోంది. వీటి వల్ల మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి’ అని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.