
పురుగుమందు డబ్బాలతో మిషన్ భగీరథ కాంట్రాక్టర్ల నిరసన
18 నెలలుగా బిల్లుల పెండింగ్
వాటర్ ట్యాంకులు కట్టి 18 నెలలవుతున్నా బిల్లులు చెల్లించకుండా వేధిస్తున్నారని మంగళవారం సూర్యాపేట మిషన్ భగీరథ ఆఫీస్ ఎదుట కుటుంబసభ్యులు సహా పురుగుమందు డబ్బాలతో కాంట్రాక్టర్లు ధర్నా చేపట్టారు. బిల్లులు ఇస్తారా మూకుమ్మడిగా చావమంటారా అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా బొల్లారం గ్రామానికి చెందిన గుణగంటి ఆనందరావు, వెలుగు శంకర్ అనే కాంట్రాక్టర్లు జీవీపీఆర్ కంపెనీ నుంచి మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు కట్టడం కోసం సబ్ కాంట్రాక్టు తీసుకున్నారు.
పెన్‌పహాడ్ మండలంలోని అనంతారం, సూర్యాపేట మండలం లోని కుసుమవారిగూడెం గ్రామాలలో 40 కిలో లీటర్ల కెపాసిటీ గల రెండు ట్యాంకులను 18 నెలల క్రితం కట్టారు. వీటికి రూ.1.26 కోట్ల బిల్లు కాగా ఇప్పటి వరకు 80 లక్షలు చెల్లించారని, ఇంకా 46 లక్షలు ఇవ్వాలన్నారు. వాటిని చెల్లించకపోతే చావే శరణ్యమంటూ పురుగుమందు డబ్బాతో ఆత్మహత్యయత్నం చేశారు. జీవీపీఆర్, మిషన్ భగీరథ ఆఫీస్‌ల చుట్టూ తిరిగి తిరిగి కాళ్లరిగాయే తప్ప బిల్లులు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేసారు.
మిషన్ భగీరథ డీఈ నరేష్, జీవీపీఆర్ కంపెనీతో కుమ్మక్కై ఎంబీ రికార్డులు ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆరోపించారు. వెలుగు శంకర్ భార్య వెలుగు రజిత పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అడ్డుకొన్నారు. ఘటనా స్థలానికి వచ్చిన సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వరరావు బాధితులతో మాట్లాడుతూ 9వ తేదీని ప్రధాన కాంట్రాక్టర్‌ను పిలిపించి దీనిపై చర్చిస్తామని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు.