కొత్త రూల్.. స్టూడెంట్ ఫెయిలైతే సబ్జెక్ట్​ టీచర్‍దే బాధ్యత

కొత్త రూల్.. స్టూడెంట్ ఫెయిలైతే సబ్జెక్ట్​ టీచర్‍దే బాధ్యత
  • టీచర్ల నుంచి అండర్ టేకింగ్ లెటర్లు
  • టెన్త్ రిజల్ట్స్ పై సమీక్షలోడీఈవోకు కలెక్టర్‍ సూచన
  • తమను బాధ్యులుగా చూడటం పై టీచర్ల ఆవేదన

హైదరాబాద్‍, వెలుగు:  టెన్త్ రిజల్ట్స్ లో గవర్నమెంట్‍ స్కూళ్లలో చదివే ప్రతి స్టూడెంట్‍ పాసయ్యేలా ఆయా సబ్జెక్ట్ టీచర్లు బాధ్యత తీసుకుకోవాలని, ఆ మేరకు అండర్‍ టేకింగ్‍ లెటర్లు ఇవ్వాలని డీఈవో ఆదేశాలిచ్చారు. దీనిపై టీచర్‍ యూనియన్లు మండిపడుతున్నాయి. కొత్త కలెక్టర్‍ ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సిందేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ అండర్‍ టేకింగ్‍ లేటర్లు ఇయ్యాల్సిందేనని హెచ్‍ఎంలు టీచర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ విషయంపై డీఈవోని కలిసిన టీచర్స్ యూనియన్లు నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాస్త వెనక్కి తగ్గిన డీఈవో అక్‍నాలెడ్జ్ మెంట్‍ అయినా ఇవ్వాలని తెలిపారు. దీనికి కూడా టీచర్స్ యూనియన్లు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. గవర్నమెంట్ స్కూళ్లలో టెన్త్ లో పాస్‍ పర్సెంటేజీ పెరిగేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామని, ఈ విషయంలో అనుమానం అవసరం లేదని, ఇలా అండర్ టేకింగ్‍ లెటర్లు అడగడం, టీచర్లపై ఒత్తిడి తేవడం సరికాదని టీచర్స్ యూనియన్‍ నేతలు వాపోతున్నారు.

100 శాతం కృషి చేస్తున్నం

ఒక స్టూడెంట్‍ ఎగ్జామ్‍లో ఫెయిల్ అయ్యేందుకు సవాలక్ష కారణాలుంటాయి. అలాంటి పరిస్థితుల్లో కేవలం ఒక టీచర్‍దే బాధ్యత అనడం సహేతుకంగా లేదని టీచర్‍ యూనియన్‍ నేతలు అభిప్రాపడుతున్నారు. ఏ సబ్జెక్టుల్లో ఫెయిలయితే.. ఆ టీచర్‍ బాధ్యత వహించాలనడం, పైగా ఆ మేరకు ధ్రువీకరిస్తూ అండర్ టేకింగ్‍ లెటర్లు ఇవ్వాలనడం సబబుగా లేదంటున్నారు. ఎగ్జామ్స్ సమీపిస్తున్న సమయంలో టీచర్లపై తీవ్రంగా ఒత్తడి తీసుకొస్తే ఫలితాలపై నెగటివ్‍ ప్రభావం చూపే అవకాశముందంటున్నారు. ప్రతి స్టూడెంట్‍ పాసయ్యేందుకు తాము 100 శాతం కృషి చేస్తున్నామని, ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నట్లు గుర్తు చేస్తున్నారు. మోడల్‍ ఎగ్జామ్స్​ను కండక్ట్ చేసి స్టూడెంట్‍ ఎందులో వీక్‍గా ఉన్నాడో గుర్తించి దానిని అధిగమించేందుకు ప్రణాళిక బద్ధంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇంత చేస్తున్నా అధికారులు తమనే బాధ్యులుగా చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమీక్షతో మారిన సమీకరణాలు

కలెక్టర్‍గా బాధ్యతలు స్వీకరించిన శ్వేతా మహంతి టెన్త్ రిజల్ట్స్ పై సమీక్ష నిర్వహించారు. డీఈవోతో పాటు డిప్యూటీ ఈఓలు పాల్గొన్నారు. టెన్త్ ఎగ్జామ్‍లో గతేడాది కంటే మెరుగైన రిజల్ట్స్ వచ్చేందుకు అందరూ ఛాలెంజ్‍గా పని చేసేలా టీచర్లకు గైడ్‍ చేయాలని డీఈవోకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్క టీచర్‍ కొందరు స్టూడెంట్స్ ను అడాప్ట్ చేసుకొని వారు ఎగ్జామ్‍లో పాసయ్యేలా పర్యవేక్షణ చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. స్టూడెంట్‍ ఫెయిలైతే తమదే బాధ్యత అంటూ టీచర్ల నుంచి అండర్‍ టేకింగ్‍ లేటర్లు తీసుకోవాలని కలెక్టర్‍ సూచించినట్టు తెలుస్తోంది. డీఈవో హెచ్‍ఎంలకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు సమాచారం. దీంతో హెచ్‍ఎంలు టీచర్ల నుంచి లెటర్లు తీసుకునేందుకు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. గతంలో ఎన్నడూ లేనట్లు  ఇలా లెటర్లు అడగడం ఏమిటని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రతి స్టూడెంట్‍ పాస్‍ అయ్యేందుకే తాము ప్రయత్నిస్తామని, ఒకరిద్దరు ఫెయిలైతే ఆ బాధ్యత తమది ఎలా అవుతుందని  ప్రశ్నిస్తున్నారు.