న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త డైరెక్టర్ గా సుబోధ్ కుమార్ జైశ్వాల్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్న ఈయన సీబీఐ సారధిగా ఎంపికయ్యారు. రెండేళ్లపాటు ఈయన ఈ పదవిలో కొనసాగనున్నారు. గత ఫిబ్రవరిలో రిషికుమార్ శుక్లా పదవీ విరమణ చేయడంతో మూడు నెలలుగా సీబీఐ పూర్తి స్థాయి డైరెక్టర్ లేకుండా ఇంచార్జిలతో నడుస్తోంది. ఈ నేపధ్యంలో మంగళవారం ప్రధాని మోడీ సారధ్యంలో సమావేశమైన కమిటీ జైశ్వాల్ ను ఎంపిక చేసింది.
మహారాష్ట్ర కేడర్ కు చెందిన ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైవ్వాల్ ను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్ సభ విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురితో కూడిన త్రిసభ్య కమిటీ ఈయనను ఎంపిక చేసింది. దేశ వ్యాప్తంగా ఐపీఎస్ సిన్సియర్ ఆఫీసర్ల జాబితాలో మొత్తం 109 మంది డైరెక్టర్ పదవిపై అర్హతతో రేసులో నిలిచారు. సీఐఎస్ఎఫ్ తోపాటు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లో 9 సంవత్సరాలకుపైబడి పనిచేసిన సుదీర్ఘ అనుభవంతో సీబీఐ సారథిగా ఎంపికయ్యారు.
1962 సెప్టెంబర్ 22న జన్మించిన సుబోధ్ కుమార్ జైశ్వాల్ 1985లో ఐపీఎస్ కు ఎంపికయ్యారు. సీబీఐ డైరెక్టర్ పదవికి చేసిన షార్ట్ లిస్టులో బీహార్ కేడర్ కు చెందిన ఎస్ఎస్ఎస్ బీ డైరెక్టర్ జనరల్ కుమార్ రాజేష్ చంద్ర, ఏపీ కేడర్ అధికారి కౌముది కంటే సీనియర్ కావడంతో కమిటీ ఈయన వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. గతంలో ఈయన మహారాష్ట్ర డీజీపీగా పనిచేశారు. సీఎంగా ఫడ్నవీస్ హయాంలో ముంబై పోలీసు కమిషనర్ గా వ్యవహరించారు.
