ఇగో వస్తయ్.. అగో వస్తయ్

ఇగో వస్తయ్.. అగో వస్తయ్
  • ఇగో వస్తయ్.. అగో వస్తయ్
  • కామారెడ్డి జిల్లాలో మూడేండ్లుగా అందని సబ్సిడీ గొర్రెలు 
  • 1,845 మందికి ఇచ్చి 604 మందికి ఆపిన ఆఫీసర్లు
  • రెండు సార్లు డీడీలు కట్టి ఎదురుచూస్తున్న లబ్ధిదారులు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో రెండో విడతలో భాగంగా పంపిణీ చేయాల్సిన సబ్సిడీ గొర్రెల కోసం 604 మంది లబ్ధిదారులు మూడేండ్లుగా ఎదురు చూస్తున్నారు. 2,449 మందిని ఎంపిక చేసిన ఆఫీసర్లు 1,845 మందికి ఇచ్చి మిగిలిన వారికి ఆపేశారు. మొదట ఒక్కో యూనిట్​కోసం రూ.37,500 కట్టించుకున్నారు. తర్వాత రేట్లు పెరిగాయని చెప్పడంతో మరోసారి రూ.12,500 పెట్టి డీడీలు తీయించారు. ఏండ్లు గడుస్తున్నాయే తప్ప ఆఫీసర్లు వాటి ఊసెత్తడం లేదు. పైసలు కట్టిన లబ్ధిదారులు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎప్పుడు అడిగినా అదిగో.. ఇదిగో అంటున్నారని వాపోతున్నారు. 
25 శాతం కడితే చాలు..
గ్రామీణ వాసులు గొర్రెల పెంపకం ద్వారా ఉపాధి పొందేలా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ గొర్రెల పంపిణీ స్కీమ్​ను తెచ్చింది. ఒక్కో యూనిట్​లో 21 గొర్రెలు(20 ఆడ, ఒక మగ) పంపిణీ చేసింది. యూనిట్ కాస్ట్ ను రూ.లక్షా25వేలుగా నిర్ణయించారు. అందులో లబ్ధిదారులు 25 శాతం చెల్లిస్తే చాలని, మిగతా మొత్తం ప్రభుత్వం భరిస్తుందని ఆఫీసర్లు చెప్పారు. 2017–-18లో ఈ స్కీమ్​అమలులోకి రాగా, మొదటి విడతలో భాగంగా కామారెడ్డి జిల్లాలో 8,640 మంది లబ్ధిదారులతో డీడీలు తీయించి గొర్రెల యూనిట్లు పంపిణీ చేశారు. 2018–-19లో రెండో విడతలో భాగంగా 2,449 మందిని ఎంపిక చేశారు. వారందరి చేత డీడీలు తీయించేరే గానీ గొర్రెలు పంపిణీ చేయలేదు. గతేడాది జులైలో 1,845 మందికి ఇచ్చి మిగిలిన 604 మందికి ఆపారు. 

అదనపు భారం
రెండు విడతల్లోనూ వెటర్నరీ ఆఫీసర్లు దాదాపుగా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి గొర్రెలను తెచ్చి పంచారు. ఆయా రాష్ట్రాల్లో గొర్రెల రేట్లు పెరిగాయని చెప్పి యూనిట్​కాస్ట్​ను రూ.లక్షా25 వేల నుంచి రూ.లక్షా75వేలకు పెంచారు. రెండో విడతలో గొర్రెలను పొందని లబ్ధిదారుల చేత గతేడాది ఆగష్టులో అదనంగా మరో రూ.12,500తో డీడీలు తీయించారు. కానీ ఇంతవరకు లబ్ధిదారులకు గొర్రెలు అందలేదు. మాచారెడ్డి, భిక్కనూరు, జుక్కల్ నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన 604 మంది ఎదురుచూస్తూనే ఉన్నారు. 

త్వరలోనే పంపిణీ చేస్తం
డీడీలు కట్టి ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు గొర్రెలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నం. మే నెల మొదటి లేదా రెండో వారంలో పంపిణీ చేస్తాం. యూనిట్ కాస్ట్ పెరగడంతో లబ్ధిదారులు రెండోసారి డీడీ తీయాల్సి వచ్చింది.
‌‌‌‌‌‌‌‌- డాక్టర్ జగన్నాథచారి, జిల్లా వెటర్నరీ ఆఫీసర్