పృథ్వీకి షాక్​..8 నెలలు బ్యాన్

పృథ్వీకి షాక్​..8 నెలలు బ్యాన్

న్యూఢిల్లీ:ఇండియన్‌‌ క్రికెట్‌‌లో డోపింగ్‌‌ కలకలం. టీమిండియా ఫ్యూచర్‌‌ స్టార్‌‌, టెస్ట్‌‌ జట్టు ఓపెనర్‌‌ పృథ్వీ షా డోపింగ్‌‌లో పట్టుబడ్డాడు. అతని యూరిన్‌‌ శాంపిల్‌‌లో నిషేధిత ఉత్ప్రేరకం  ‘టెర్బుటలైన్‌‌’ ఉన్నట్లు పరీక్షలో తేలింది. దీంతో పృథ్వీపై బీసీసీఐ ఎనిమిది నెలల నిషేధం విధించింది. మార్చి 16, 2019 నుంచే అమల్లోకి వచ్చిన ఈ నిషేధం నవంబర్‌‌ 15, 2019తో ముగుస్తుంది. అంతవరకు ఈ ముంబైకర్‌‌ ఏ ఫార్మాట్‌‌లో ఆడే అవకాశం లేదని బోర్డు వెల్లడించింది. క్రికెటర్‌‌ తెలియకుండా ఈ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నాడని వ్యాఖ్యానించింది. పృథ్వీతో పాటు దేశవాళీ క్రికెటర్లు అక్షయ్‌‌ దుల్లార్వార్‌‌ (విదర్భ), దివ్య గజ్‌‌రాజ్‌‌ (రాజస్థాన్‌‌) కూడా డోపింగ్‌‌లో పట్టుబడ్డారు. అండర్‌‌–23 వన్డే మ్యాచ్‌‌ సందర్భంగా అక్షయ్‌‌.. డెఫ్లాజోకార్ట్‌‌ను తీసుకున్నట్లు తేలడంతో అతనిపై 8 నెలల బ్యాన్‌‌ విధించారు. రాజస్థాన్‌‌ అండర్‌‌–19 క్రికెటర్‌‌ గజ్‌‌రాజ్‌‌ కూచ్‌‌ బెహర్‌‌ ట్రోఫీ మ్యాచ్‌‌లో ఎసిటజోలామైడ్‌‌ను వాడినట్లు తేలింది. దీంతో అతన్ని 6 నెలల పాటు నిషేధించారు. ఎసిటజోలామైడ్‌‌.. డై యూరిటిక్‌‌ అండ్‌‌ మాస్కింగ్‌‌ ఏజెంట్‌‌గా పని చేస్తుంది.

ముస్తాక్‌‌ అలీ ట్రోఫీలో..

బీసీసీఐ యాంటీ డోపింగ్‌‌ ప్రోగ్రామ్‌‌లో భాగంగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఇండోర్‌‌లో జరిగిన సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ ట్రోఫీ సందర్భంగా పృథ్వీ యూరిన్‌‌ శాంపిల్స్‌‌ను సేకరించారు. ఈ శాంపిల్స్‌‌ను పరీక్షించగా, అందులో ‘టెర్బుటలైన్‌‌’ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ‘వాడా’ నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో ఉన్న టెర్బుటలైన్‌‌ను ఇన్‌‌ అండ్‌‌ అవుట్‌‌ కాంపిటిషన్స్‌‌లో వాడటం నిషేధం. దగ్గుకు ఉపయోగించే మందుల్లో ఎక్కువగా ఇది ఉంటుంది. అయితే అథ్లెట్లకు ఇలాంటి మందుల గురించి ముందే తెలిసి ఉంటుంది. కచ్చితంగా వాడాల్సి వస్తే ముందస్తుగా థెరాపిటిక్‌‌ యూజ్​ ఎక్సెంప్షన్‌‌ (టీయూఈ) సర్టిఫికెట్‌‌ను  తీసుకుంటారు. కానీ పృథ్వీ ఈ సర్టిఫికెట్‌‌ను తీసుకోలేదు. దీంతో బీసీసీఐ యాంటీ డోపింగ్‌‌ రూల్స్‌‌ (ఏడీఆర్‌‌) ఆర్టికల్‌‌ 2.1ను పృథ్వీ ఉల్లంఘించాడని తేలడంతో బీసీసీఐ అతన్ని ప్రాథమికంగా సస్పెండ్‌‌ చేసింది. డోపింగ్‌‌ ఆరోపణలు రావడంతో జూలై 16న పృథ్వీ యాంటీ డోపింగ్‌‌ ఉల్లంఘన కమిషన్‌‌ (ఏడీఆర్‌‌వీ) ముందు హాజరై వివరణ ఇచ్చాడు. తనకు తెలియకుండా ఈ ఉత్ప్రేరకాన్ని వాడినట్లు తెలిపాడు. దగ్గుతగ్గించుకునేందుకు ఈ మందును వాడినట్లు ఆధారాలతో సహా చూపెట్టాడు. పెర్ఫామెన్స్‌‌ను మెరుగుర్చేందుకు కాకుండా, కేవలం రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌‌ తగ్గేందుకు వాడినట్లు నిరూపించడంతో బోర్డు అతని వివరణపై సంతృప్తి చెందింది. ‘పృథ్వీ చూపిన ఆధారాలను నిపుణులకు చూపించాం. వాళ్లిచ్చిన సలహాలు తీసుకుని క్రికెటర్‌‌ వివరణపై సంతృప్తి చెందాం. దీని కారణంగా 8 నెలల బ్యాన్‌‌ను మాత్రమే విధించాం. మిగతా రిజల్ట్స్‌‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. బీసీసీఐ ఏడీఆర్‌‌ ఆర్టికల్‌‌ 10.10.3 ప్రకారం నిషేధాన్ని బ్యాక్‌‌ డేట్‌‌ నుంచి అమలు చేస్తున్నాం.  ప్రొవిజినల్‌‌ సస్పెన్షన్‌‌ను పూర్తిగా పరిగణనలోకి తీసుకున్నాం. ఆర్టికల్​ 10.10.2 ప్రకారం శాంపిల్‌‌ కలెక్షన్‌‌ చేసినప్పటి నుంచే అమలు చేయొచ్చు. ఇదంతా బోర్డు విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది’ అని బీసీసీఐ వ్యాఖ్యానించింది.