హిందుత్వంతో శాంతి

హిందుత్వంతో శాంతి

హిందుత్వమంటే కులం మతం కాదు..జీవన విధానం: వివేక్ 
సోషల్ మీడియా ద్వారా హిందుత్వంపై దాడులను తిప్పికొట్టాలి: మురళీధర్​రావు
మంచిర్యాలలో డిజిటల్​ హిందూ సమ్మేళనం సక్సెస్​
 

మంచిర్యాల, వెలుగు: హిందుత్వం అంటే మతం, కులం కాదని అదొక జీవన విధానమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జి. వివేక్ ​వెంకటస్వామి అన్నారు. హిందుత్వంతోనే శాంతి, సోదరభావం, సహజీవనం సాధ్యమని ఇండియా ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. మంచిర్యాలలో బుధవారం జరిగిన ‘భారత్ నీతి డిజిటల్ హిందూ సమ్మేళనం’లో బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్​చార్జి పి.మురళీధర్​రావుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మీటింగ్​లో వివేక్ మాట్లాడుతూ ప్రపంచంలోనే హిందుత్వకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఇటీవల కాలంలో హిందుత్వంపై అనేక చర్చలు జరుగుతున్నాయన్నారు. హిందుత్వలో భాగమైన యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందన్నారు. యోగాతో క్రమశిక్షణ అలవడుతుందని, సమస్యలను, సవాళ్లను ఎదుర్కొనే శక్తి వస్తుందని తెలిపారు. ఐక్యరాజ్య సమితి ‘ఇంటర్నేషనల్ యోగా డే’ను ప్రకటించడం ప్రధాన మంత్రి మోడీ కృషి ఫలితమే అన్నారు. టీఆర్​ఎస్ పాలనలో హిందువులపై దాడులు పెరుగుతున్నాయన్నారు. హిందుత్వను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
 

గుళ్ల భూములు కబ్జా చేస్తున్నరు
హిందువులపై, హిందుత్వ భావాలపై ఇటీవల కాలంలో దాడులు పెరుగుతున్నాయని మురళీధర్​ రావు అన్నారు. ఇవి బయటకు రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, వాటికి తొత్తుగా ఉన్న మీడియా సంస్థలు కప్పిపెడుతున్నాయని ఆరోపించారు. సామాన్యుల చేతిలో అస్త్రమైన డిజిటల్​ మీడియా ద్వారా హిందుత్వంపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో హిందూ దేవాలయాల భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, అధికార పార్టీల నేతలు, బడాబాబులు ఆలయాల భూములను కజ్జా చేస్తున్నారని, వాటిపై పోరాటం చేయాలని మురళీధర్​రావు కోరారు. హైదరాబాద్​తో పాటు ఆదిలాబాద్, నిర్మల్​, భైంసా, బోధన్​లలోనే కాకుండా రాష్ట్రం, దేశమంతటా హిందూ ధర్మానికి ప్రమాదం పొంచి ఉందన్నారు.
 

హిందూ ధర్మాన్ని రక్షించే పాలకులు రావాలి
హిందూ ధర్మాన్ని రక్షించే పాలకులు రావాలని కృష్ణమఠం ఆధ్యాత్మిక గురువు యోగానంద సరస్వతీ గోపాల అన్నారు. హిందూ ధర్మాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ బాధ్యత యువత చేతిలోనే ఉందని ఆయన చెప్పారు. జర్నలిస్ట్ సంకేపల్లి భరత్​కుమార్, ఆధ్యాత్మికవేత్త సత్యనారాయణ్ మౌర్యజీ, నగునూరి వెంకటేశ్వర్లు, గోనె శ్యాంసుందర్​రావు, ముల్కల్ల మల్లారెడ్డి, మున్నారాజ్​ సిసోడియా, తుల మధుసూదన్​రావు, పానుగంటి మధు, తుల ఆంజనేయులు, ఆకుల అశోక్​, సోమ ప్రదీప్​చంద్ర, సుశీల్​కుమార్​, అమిరిశెట్టి మల్లేశ్​​, వెరబెల్లి రఘునాథ్​రావు, కొయ్యడ ఏమాజీ, అందుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు