గాలి, నీటినీ ప్రైవేటుకు అప్పగించేందుకు కుట్ర : సుధా సుందరరామన్

గాలి, నీటినీ ప్రైవేటుకు అప్పగించేందుకు కుట్ర : సుధా సుందరరామన్
  •     మోదీ సర్కార్ కార్పొరేట్ల కోసమే: సుధా సుందరరామన్

హైదరాబాద్, వెలుగు: పీల్చే గాలి, తాగే నీటిని కూడా ప్రైవేటోళ్లకు అప్పజెప్పేందుకు కేంద్ర పాలకులు కుట్రలు చేస్తున్నారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ ఉపాధ్యక్షురాలు సుధా సుందర రామన్ మండిపడ్డారు. కార్పొరేట్ల కోసమే మోదీ సర్కార్ పనిచేస్తున్నదని విమర్శించారు.  దేశంలోని మహిళలపై ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీలు దాడులకు తెగబడుతున్నాయని, సామాన్యుడు బతకడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

మంగళవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ఐద్వా 14వ జాతీయ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా ట్రెజరర్ పుణ్యవతి, రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మీతో కలిసి సుధా సుందర రామన్ మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా పౌరసత్వం పేరుతో బీజేపీ సర్కార్ మహిళలను వేధిస్తోందని ఆరోపించారు. చనిపోయిన తండ్రుల బర్త్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కొర్రీలు పెట్టడం మహిళలను వేధించడం కాదా?  అని ప్రశ్నించారు. 

బిహార్‌‌‌‌‌‌‌‌లో ఎన్నికలకు ముందు సర్వే పేరుతో 65 లక్షల ఓట్లను తొలగిస్తే.. అందులో 45 లక్షల మంది మహిళలే ఉన్నారని గుర్తుచేశారు. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ల లాభాల కోసం అడవులను నరికేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం వాతావరణ మార్పుల నుంచి మహిళలకు రక్షణ కల్పిస్తోందని ప్రశంసించారు. పుణ్యవతి మాట్లాడుతూ..కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎస్సీ, ఎస్టీ, మహిళల బతుకులపై దాడి చేస్తోందని ఆరోపించారు. 

ఆర్బీఐ నుంచి పావలా వడ్డీకి అప్పులు తెచ్చుకుంటున్న మైక్రో ఫైనాన్స్ కంపెనీలు.. మహిళలకు మాత్రం రూ.2 నుంచి రూ.10 మిత్తికి ఇచ్చి రక్తం తాగుతున్నాయని మండిపడ్డారు. కార్మిక చట్టాలను రద్దు చేస్తూ తెచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో ఐద్వా పాల్గొంటుందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర మహిళల రూ.600 కోట్ల అభయహస్తం డబ్బులను ప్రభుత్వం వెంటనే తిరిగివ్వాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏడు పుస్తకాలను ఐద్వా నేతలు ఆవిష్కరించారు.