టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు, బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటించిన చిత్రం 'జటాధర'. ఈ సినిమా ఈ రోజు ( నవంబర్ 7న ) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. గత కొంతకాలంగా ప్రేక్షకులను ఆకర్షిస్తున్న డివోషనల్ హారర్ థ్రిల్లర్ జానర్‌లో ఈ సినిమా వచ్చింది. నిధుల కోసం లంకె బిందెలు, వాటికి రక్షణగా 'పిశాచ బంధనం' అనే క్షుద్రశక్తి అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ ముందుకు వచ్చారు. మరి క్షుద్ర శక్తులతో పోరాటం.. మెప్పించిందో.. లేదో చూద్దాం..
కథాంశం..
దెయ్యాలు, ఆత్మలు లేవని, వాటిని కేవలం సైన్స్‌తోనే నమ్మాలని వాదించే ఘోస్ట్ హంటర్ శివ (సుధీర్ బాబు) చుట్టూ కథ తిరుగుతుంది. రుద్రారం అనే గ్రామంలో అనుమానాస్పద మరణం గురించి తెలుసుకున్న శివ, పరిశోధన కోసం అక్కడికి వెళ్తాడు. దెయ్యాలున్నాయని ప్రచారం జరిగే ఆ గ్రామానికి వెళ్లవద్దంటూ అతని తల్లిదండ్రులు (రాజీవ్ కనకాల, ఝాన్సీ) అడ్డుకుంటారు. రుద్రారం గ్రామానికి, శివకి ఉన్న సంబంధం ఏమిటి? ఆ గ్రామంలో తిష్టవేసిన ధన పిశాచి (సోనాక్షి సిన్హా) ఎవరు? ఆమె వల్ల శివ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏమిటి? తన గతం తెలుసుకున్న శివ, తన తల్లిదండ్రుల ఆత్మలకు శాంతి కలిగించడానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనేది కథాంశం.
ఎలా ఉందంటే?
మైథలాజికల్ హారర్ చిత్రాలకు ఉండే రెగ్యులర్ ఫార్ములాలోనే 'జటాధర' కథనం సాగుతుంది. నిధులు, క్షుద్రశక్తులు, దెయ్యాలను నమ్మని హీరో ప్రవేశం, ఫ్లాష్‌బ్యాక్‌లో హీరోకు ఆ ప్రాంతంతో సంబంధం ఉండటం, చివరకు దైవశక్తితో దుష్టశక్తులను అంతం చేయడం అనే ప్యాటర్న్‌లోనే కథ నడిచింది. అయితే, ప్రేక్షకులు భయపడటం, కథలోని భావోద్వేగాలకు కనెక్ట్ అవడం అనే రెండు కీలక అంశాలలో దర్శకులు విఫలమయ్యారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు..
కథలో కొత్తదనం లేకపోవడం ఒక మైనస్ అయితే, కథనం కూడా ఆసక్తికరంగా నడవకపోవడం పెద్ద లోపంగా చెబుతున్నారు.. లంకె బిందెలు, బంధనాల గురించి ఆరంభంలో చెప్పిన కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా, ఆ తర్వాత కథనం నీరసంగా మారుతుంది. ఘోస్ట్ హంటర్‌గా శివ చేసే విన్యాసాలు సాగదీతగా అనిపిస్తాయి. ప్రథమార్థంలో కథనం ముందుకు కదలనట్లు అనిపిస్తుంది. సోనాక్షి సిన్హా పోషించిన ధన పిశాచి పాత్ర లుక్ పరంగా భయపెట్టేలా ఉన్నా, ఆమె సన్నివేశాలు అనుకున్నంత ప్రభావం చూపలేకపోయాయి. ద్వితీయార్థంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడం, అనవసరమైన సాగదీత వల్ల ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారింది. క్లైమాక్స్‌లో వచ్చే శివుడి ఎపిసోడ్ కూడా ప్రేక్షకులలో ఉత్సాహం నింపలేకపోయింది. పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పి శుభం కార్డు వేయడం గమనించదగిన అంశం.
ALSO READ : Pre Wedding Show Review: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ రివ్యూ..
ఎవరెలా చేశారంటే..
సుధీర్ బాబు తన పాత్రకు న్యాయం చేయడానికి శాయశక్తుల ప్రయత్నించినా, బలహీనమైన పాత్ర రూపకల్పన, స్క్రిప్ట్ కారణంగా ఆ కష్టం వృథా అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. 'ధన పిశాచి'గా సోనాక్షి సిన్హా లుక్ ఆకట్టుకుంది. తెలుగులో ఆమెకు ఇది మొదటి సినిమా.. అయితే ఆమె పాత్రకు పెద్దగా డైలాగులు లేకపోవడం, కేవలం అరుపులు, నవ్వులకే పరిమితం కావడం వల్ల ప్రభావం చూపలేకపోయింది. నెగెటివ్ షేడ్ ఉన్న శోభ పాత్రలో శిల్పా శిరోద్కర్ ఒదిగిపోయింది. దివ్య ఖోస్లా పాత్ర నిడివి తక్కువగా ఉంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక అంశాలు..
సంగీతం , నేపథ్య సంగీతం సినిమా స్థాయికి తగ్గట్టుగా లేవు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. వీఎఫ్‌ఎక్స్ విభాగం పనితీరు జస్ట్ ఓకే అనిపిస్తుంది. నిర్మాతలు మంచి నిర్మాణ విలువలను అందించారు. ఈ సినిమాలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, దివ్య ఖోస్లా, రాజీవ్ కనకాల, ఝాన్సీ, అవసరాల శ్రీనివాస్ తదితరులు నిర్మాతలు, ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా దర్శకత్వం వహించారు. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వా సంగీతం అందించారు. సారూప్యమైన కథాంశం, ఆకట్టుకోని కథనం, ప్రేక్షకులను భయపెట్టలేకపోవడం, భావోద్వేగాలకు కనెక్ట్ చేయలేకపోవడం వంటి లోపాల కారణంగా 'జటాధర' సాధారణ హారర్ థ్రిల్లర్‌గానే మిగిలిపోయిందని సామాన్య ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
