మసుధ ఫేమ్’తిరువీర్ హీరోగా రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. టీనా శ్రావ్య హీరోయిన్‌గా నటించింది. '90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'లో నటించిన 'మాస్టర్' రోహన్ క్రేజీ పాత్ర పోషించాడు. సందీప్ అగరం, అష్మితా రెడ్డి నిర్మించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.
ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా శుక్రవారం (2025 నవంబర్ 7న) థియేటర్లోకి వచ్చింది. అయితే, మీడియాకి రెండు రోజుల ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించింది చిత్ర యూనిట్. ఇలా కంటెంట్పై నమ్మకంతో వచ్చిన ప్రీ వెడ్డింగ్ షో ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.
కథేంటంటే:
శ్రీకాకుళంలోని ఓ మారుమూల పల్లెటూరు. ఆ గ్రామంలో రమేష్ (తిరువీర్), జిరాక్స్ సెంటర్‌తో పాటు ఫోటో స్టూడియో నడిపిస్తుంటాడు. అలా ఆ ఊర్లో జరిగే పెళ్లిళ్లు, పేరంటాలు, ఫంక్షన్లకు ఫోటోలు, వీడియోలు తీస్తుంటాడు. ఇక అదే ఊర్లో, తన ఫోటో స్టూడియోకి ఎదురుగా పంచాయతీ ఆఫీస్ ఉంటుంది. అక్కడ పంచాయితీ సెక్రటరీగా ఉద్యోగం చేస్తున్నహేమ (టీనా శ్రావ్య)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. హేమకు కూడా రమేష్ అంటే ఇష్టమే ఉంటుంది. కానీ, ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తపరుచుకోకుండా ప్రేమించుకుంటారు.
అలా ఒకరోజు పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఆనంద్ (నరేంద్ర రవి) రమేష్‌ను కలుస్తాడు. ఈ క్రమంలో తనకు సౌందర్య (యామిని నాగేశ్వర్)తో పెళ్లి సెట్ అయిందని చెబుతాడు. ఇందుకోసం తన పెళ్లికి ప్రీ వెడ్డింగ్ షూట్‌ను గ్రాండ్‌గా తీయాలని రమేష్ను ఆనంద్ కోరుతాడు. వెంటనే ఒకే చెప్పి.. దాదాపు రెండు లక్షలు ఖర్చుపెట్టించి గ్రాండ్గా ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తాడు రమేష్. అయితే, ఆ ఫుటేజ్ అంత ఉన్న చిప్‌ను కాపీ చేయమని తన దగ్గర పనిచేసే అబ్బాయి (రోహన్ రాయ్)కి ఇస్తాడు. కానీ, అతను ఆ చిప్‌ను ఎక్కడో పొగొడతాడు.
ఊర్లో రాజకీయ బలగం ఉన్న ఆనంద్‌కి.. చిప్ పోయిందనే విషయం తెలిస్తే, తనని ఏదైనా చేస్తాడని రమేష్ భయపడుతాడు. ఈ క్రమంలో ఆనంద్‌కి ఏం చెప్పాలో తెలియక, తప్పించుకుంటూ ఉంటాడు. కాల్స్ చేసిన కట్ చేస్తుంటాడు. ఎలాగైనా ఈ గండం నుంచి బయటపడాలని ఒక ఉపాయం ఆలోచిస్తాడు. కానీ, అంతలోనే ఆనంద్ మ్యారేజ్ ఆగిపోయిందనే వార్తా వినిపిస్తుంది. అసలు చిప్ ఎలా మిస్ అవుతుంది? సడెన్గా పెళ్లి ఎందుకు ఆగిపోతుంది? రమేష్ ఆలోచించిన ఆ ఉపాయం ఏంటీ? రమేష్, హేమల లవ్ మ్యాటర్ ఎంతవరకు వస్తుంది? చివరకు ఆనంద్-సౌందర్యల పెళ్లి జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే!!
ఎలా ఉందంటే:
‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ కథ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.." వెడ్డింగ్ ఫోటో గ్రాఫర్ చుట్టూ ఓ ప్రేమ కథ, ఓ వింత సమస్య, దాన్నుంచి జనరేట్ అయ్యే కామెడీ.." ఇదే కథ. అయితే, ప్రేక్షకుల్ని నవ్వించడానికి రాసుకున్న స్క్రీన్ ప్లే, కామెడీ అంశాలు ప్రధాన బలంగా నిలిచాయి. చూపులతోనే ప్యూర్ లవ్ జనరేట్ చేస్తూ, కథకు ఆయువుపట్టులాంటి కామెడీతో వచ్చి దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ సక్సెస్ అయ్యాడు.
ఈ మధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది చాలామందికి అవసరమైన ప్రక్రియ. ఇంకా చెప్పుకోవాలంటే.. ప్రీ వెడ్డింగ్ షూట్ లేకపోతే.. పెళ్లి అవ్వదు అనేలా ముస్తాబులా మారింది. అలాంటి ట్రెండింగ్ అంశాన్ని, కామెడీ యాంగిల్లో చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్.
అయితే, ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన చిప్ మిస్ అవ్వడం మరింత ఇంట్రెస్ట్ కలిగించే అంశం. ఇదే విషయాన్ని ట్రైలర్లో చూపించి ఆడియన్స్ని ముందుగానే అలర్ట్ చేశాడు డైరెక్టర్. ఇక ఊహించుకోండి.. లక్షలు ఖర్చుపెట్టి షూట్ చేసుకున్న ఆ పెళ్లి పిల్లగాడి టెన్షన్ ఎలా ఉంటుందో!
ఫస్టాఫ్ విషయానికి వస్తే.. పల్లెటూరి నేపథ్యం, అక్కడి మనుషుల పరిచయాలు, రమేష్-హేమ ప్రేమ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. అలా ఈ మధ్యలో వచ్చే సరదా కామెడీ సీన్లు కథను ముందుకు తీసుకెళ్తాయి. ఈ క్రమంలోనే ప్రీ వెడ్డింగ్ షూట్ సీన్స్, చిప్ మిస్ అవడం వంటి సన్నివేశాలు నేచురల్‌గా కనిపిస్తాయి. అయితే, ఇలాంటి సినిమాల్లో కథ కొంత ఊహించదగ్గట్టుగా ఉన్నా.. ఎక్కడ బోర్ కొట్టించకుండా సాగేలా చేశాడు డైరెక్టర్. ఇక ఇంటర్వెల్లో ఆనంద్ తన పెళ్లి ఆగిపోయిందని చెప్పే సీన్ మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది.
సెకండాఫ్ విషయానికి వస్తే.. చిప్ మిస్ అయ్యాక కథనాన్ని పరుగులు పెట్టించాడు డైరెక్టర్. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా సీన్స్ తీర్చిదిద్దారు. ఫోటోగ్రాఫర్ దృష్టిలో పెళ్లి, జ్ఞాపకాలు, భావాలు అనే థీమ్‌తో వచ్చే డైలాగులు గుండెను తాకుతాయి. ఆనంద్, సౌందర్యలు విడిపోవడానికి గల కారణం నవ్విస్తూనే.. అందర్నీ ఆలోచింపజేస్తూంది. క్లైమాక్స్ ముందు హీరో చెప్పే డైలాగ్స్, అపుడు తిరువీర్ చూపే హావభావాలు ఎమోషనల్ అయ్యేలా చేస్తాయి. ఓవరాల్గా సహజమైన పల్లెటూరి కథను, కామెడీతో సింక్ చేసి చూస్తే ప్రీ వెడ్డింగ్ అదిరిపోతుంది.
ఎవరెలా నటించారంటే:
తిరువీర్.. అమాయకంగా, భయపడే పాత్రలో అద్భుతంగా నటించాడు. నరేంద్ర రవి పెళ్లికొడుకు ఆనంద్ పాత్రలో జీవించేశాడు. నవ్విస్తూనే కొన్ని చోట్ల భావోధ్వేగానికి గురి చేస్తాడు. టీనా శ్రావ్య క్యూట్‌గా, సహజంగా ఆకట్టుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ మరోసారి తనదైన నటనతో నవ్వులు పూయించాడు. మిగతా పాత్రల్లో నటించిన యామిని నాగేశ్వర్, వాల్తేర్ విజయ్, ప్రభావతి, మాధవి, జోగారావు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
