పరుగెడుతూ ఎన్నో సందేశాలను తీసుకెళ్లింది

పరుగెడుతూ ఎన్నో సందేశాలను తీసుకెళ్లింది

‘నువ్వు ప్రయాణం చేయనప్పుడు, 
నువ్వు దేశాలు తిరగనప్పుడు,
నీ దినచర్య మార్చుకోలేనప్పుడు 
నీ కలలను నువ్వు వెంటాడుతూ పోలేనపుడు,
నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు’ 

అంటాడు పాపులర్​ చిలీ పోయెట్​ ‘పాబ్లో నెరుడా’... ఇలా మనిషి తన డ్రీమ్స్​ కోసం, తనను తాను కొత్తగా మార్చుకోవడం, జీవితాన్ని ఆనందించడం కోసం గొప్ప గొప్ప గోల్స్​ పెట్టుకోవాలి. అలాంటి గోల్స్​నే రీచ్​ అవుతోంది కాశ్మీర్​కు చెందిన సూఫియా ఖాన్​. తన ఆనందం కోసమే కాదు, దేశం కోసం పరుగెడుతోంది. ఆమె పరుగు ప్రపంచ రికార్డులను సృష్టించింది. ప్రపంచంలోనే మొదటి అల్ట్రా మారథాన్​ రన్నర్​గా సోఫియా రికార్డు నెలకొల్పింది. మనాలి నుంచి లెహ్​ ​ వరకూ ఆరు రోజుల్లోనే 480 కిలోమీటర్లు పరిగెత్తి తన సత్తా చాటింది. 

రాజస్తాన్​​లో పుట్టిన ఈ అమ్మాయి... కాశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకూ.. జైపూర్​ నుంచి ఆగ్రా, ఢిల్లీ వరకూ చిరుతలా పరిగెత్తింది. ఇటీవల మనాలి నుంచి లెహ్​ వరకూ పరిగెత్తిన మొదటి అల్ట్రా మారథాన్​ రన్నర్​ అనిపించుకుంది. సూఫియా ఖాన్​ పుట్టింది రాజస్తాన్​​లోని అజ్మీర్​లో. ఆమెది పేద కుటుంబం. పదహారేండ్ల వయసులోనే  తండ్రి చనిపోయాడు. తల్లి కష్టపడి డిగ్రీ వరకు చదివించింది. గ్రాడ్యుయేషన్​ అయ్యాక గవర్నమెంట్​ జాబ్​ చేయమని చెప్పేది తల్లి. కానీ సూఫియా డ్రీమ్స్​ వేరు. ఆమెకు ఏవియేషన్​ ఫీల్డ్​ అంటే ఇష్టం. అందుకు ఒక ప్రైవేట్​ కంపెనీలో స్టాఫ్​గా చేరింది. అక్కడ పని ఎంతో క్రిటికల్​ గా ఉండేది. అదొక రకమైన చాకిరి. ‘ఇష్టమైన ఫీల్డ్​ కూడా ఇంత కష్టమా’ అనిపించింది తనకే. అయినా ఏడాది కాలంగా ఆ కంపెనీలో బండ చాకిరి చేసింది. ఒక దశలో తను చేయాలను కుంది ఇది కాదు కదా అని అనిపించింది తనకు. బక్కచిక్కి పోతున్న తన శరీరాన్ని చూసి బాధపడింది. అప్పుడు  ఫిట్​నెస్​ మీద దృష్టి పెట్టింది. రోజూ కొంత పరిగెత్తడం స్టార్ట్​ చేసింది. అలా మెల్లగా స్టార్ట్​ అయిన పరుగు ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆరోగ్యం, ఫిట్​నెస్​ పెరిగింది. ఒత్తిడిని తగ్గింది.  దాంతో తనకు పరుగే సరైన తొవ్వ అనుకుంది. అందుకోసం ఎయిర్​లైన్స్​లో ఉద్యోగం మానేసీ షూ లేస్​ బిగించింది. పరుగెడుతూ పరుగెడుతూ ఓ సందేశాన్ని తీసుకెళ్లాలి అనుకుంది.  అలా మొదటి సారి ‘రన్​ ఫర్​ హోప్​– హ్యుమానిటీ, పీస్​, ఈక్వాలిటి’ సందేశంతో కాశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు 4000 కిలోమీటర్లు పరిగెత్తింది. 2019 ఏప్రిల్​లో రోజుకు సుమారు50 కిలోమీటర్ల లెక్కన వంద రోజులు పరిగెత్తి రికార్డు సృష్టించింది. అదే అమె మొదటి అఛీవ్​మెంట్​. అప్పటితో ఆమె ఆగిపోలేదు. ఆ తర్వాత ఆమె 16 రోజుల్లో 720 కిలోమీటర్ల గ్రేట్​ ఇండియా గోల్డెన్​ ట్రయాంగిల్​ రన్​ చేసింది. ఈ రకమైన పరుగు తీసిన మొదటి మహిళగా కూడా రికార్డుకెక్కింది.  ఈ మధ్య గా సెప్టెంబర్​ 2021 ‘హిమాలయన్‌‌‌‌ ఆల్ట్రా రన్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పిడిషన్‌‌‌‌’ మనాలి నుంచి మొదలుపెట్టింది. 480 కిలోమీటర్ల దూరం అది. అక్టోబర్‌‌‌‌ 1న లెహ్​ లడక్​లో ముగించింది. ఇన్ని కిలోమీటర్ల పరుగు తీసిన వాళ్లు ఇప్పటి వరకూ ఎవరూ లేరు. 

లెహ్​– మనాలి రెండూ సముద్ర మట్టానికి చాలా ఎత్తున ఉంటాయి.  రోడ్లు బాగుండవు. లోయలు, నదులు, కొండ చరియలు, మంచు కొండలు, మైనస్​ డిగ్రీల్లో చలి. ఇలా ఉంటుంది అక్కడి పరిస్థితి అయినా సంకల్పం ముందు అవేమీ పెద్ద విషయం అనిపించలేదు సూఫియాకు.‘ పరిస్థితులు ఎలా ఉన్నా పరుగెత్తాను. దీని కోసం ఈ ఏరియాలో క్యాంప్‌‌‌‌ వేసి ఇక్కడి వాతావరణాన్ని అలవాటు చేసుకున్నాను. దానికి తగ్గట్టు రెడీ అయ్యాను’ అంటోంది సూఫియా. ఇప్పటి వరకూ రెండు గిన్నిస్​ రికార్డులున్నాయి.