తమిళనాడులోని తంజావూరులో ప్రారంభించిన సీడీఎస్ రావత్
‘టైగర్ షార్క్స్’ స్క్వాడ్రన్ గా పేరు.. ఇండియన్ ఓషన్‌లో భద్రతకు కీలకం
2011లో డీకమిషన్.. చైనా కదలికల నేపథ్యంలో తిరిగి ప్రారంభం
హిందూ మహాసముద్రంలో ఏ టైంలో చూసినా కనీసం ఏడెనిమిది చైనా వార్ షిప్స్, సబ్ మెరైన్లు తిరుగుతుంటాయట. పోయిన నెలలోనే అండమాన్ దీవుల వద్దకు వచ్చిన చైనా రీసెర్చ్ షిప్ షియాన్–1ను మన యుద్ధనౌకలు వెంటాడి, పారదోలాయి. అటు ఆఫ్రికా హార్న్ ప్రాంతంలోని జిబౌటీ వద్ద, ఇటు పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు వద్ద కూడా చైనా మిలటరీ స్థావరాలు ఏర్పర్చుకుని, తరచూ సైనిక కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అందుకే.. బంగాళాఖాతంతో సహా హిందూ మహాసముద్రంలోని మన ఏరియా అంతటా భద్రతను పటిష్టం చేసేందుకు మన ఎయిర్ ఫోర్స్ ‘టైగర్ షార్క్స్’ను రంగంలోకి దింపుతోంది.
తమిళనాడులోని తంజావూరు ఎయిర్ బేస్ లో ఏర్పాటు చేసిన ‘222 స్క్వాడ్రన్’ పేరే ‘టైగర్ షార్క్స్’. సౌతిండియాలోనే తొలిసారిగా సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్లను 222 స్క్వాడ్రన్ లో ఐఏఎఫ్ మోహరిస్తోంది. వాస్తవానికి 222 స్క్వాడ్రన్ 2011లోనే ఇన్ యాక్టివ్ అయింది. తాజాగా ఇండియన్ ఓషన్ రక్షణ కోసం సుఖోయ్ ఫైటర్ జెట్లను రంగంలోకి దించాలని నిర్ణయించిన నేపథ్యంతో ఈ స్క్వాడ్రన్ ను ఐఏఎఫ్ సోమవారం తిరిగి యాక్టివేట్ చేసింది. తొలి దశలో ఇందులో ఐదారు సుఖోయ్ 30 ఫైటర్ జెట్లను ఐఏఎఫ్ సిద్ధం చేయనుంది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం18 సుఖోయ్ ఫైటర్ జెట్లను ఇక్కడ మోహరించనున్నారు.
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ ను ప్రయోగించే సత్తా ఉన్న సుఖోయ్ 30 యుద్ధ విమానాలను సోమవారం ఎయిర్ చీఫ్‌మార్షల్ రాకేశ్ సింగ్ భదౌరియా సమక్షంలో చీఫ్ఆఫ్డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ ‘టైగర్ షార్క్స్’ స్క్వాడ్రన్ లోకి అధికారికంగా ప్రవేశపెట్టారు. సౌత్ ఇండియాలో సుఖోయ్ 30 ఫైటర్ జెట్లను మోహరించడం ద్వారా ఇండియన్ ఓషన్తో పాటు మన దీవులు, భూభాగాన్ని కాపాడుకునేందుకు కీలక బలం చేకూరినట్లయిందని అధికారులు చెప్తున్నారు. ఇండియన్ ఓషన్ లో చైనాకు దీటుగా నిలిచినట్లయిందని పేర్కొంటున్నారు.
సుఖోయ్ 30 ఎంకేఐ స్పెషాలిటీస్ ఇవే..
ఎలాంటి వాతావరణంలోనైనా ప్రయాణించగలుగుతుంది.
నింగి, నేల, సముద్రం.. ఎక్కడైనా శత్రు విమానాలు, వార్ షిప్‌లను ధ్వంసం చేస్తుంది.
ఒక్కసారి ఫ్యూయెల్ నింపితే 1500 కిలోమీటర్లు వెళ్లగలదు.
ఐఎల్78 రీఫ్యూయెలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి గాలిలోనే ఇంధనం నింపుకోగలదు.
రష్యా నుంచి మొత్తం 272 సుఖోయ్ విమానాలకు గాను 260 విమానాలు ఇండియాకు చేరాయి.
‘టైగర్ షార్క్స్’ హిస్టరీ ఇదీ..
222 స్క్వాడ్రన్ ను 1969లో హర్యానాలోని అంబాలాలో ఏర్పాటు చేశారు. ఇది ఐఏఎఫ్‌లోని 12వ స్క్వాడ్రన్. 1971 జూలైలో పంజాబ్ లోని హల్వారాకు ఈ స్క్వాడ్రన్ మారింది. అదే ఏడాది ఇండో-పాక్ యుద్ధంలో ఇది కీలకంగా పని చేసింది. 1985లో తొలి మిగ్–27 విమానాలు ఈ స్క్వాడ్రన్ చేతికే అందాయి. తర్వాత 1989 మేలో దీనిని వెస్ట్ బెంగాల్ లోని హసిమారకు మార్చారు. దీనిని 2011లో అధికారికంగా డీకమిషన్ చేశారు. తాజాగా ఇండియన్ ఓషన్ లో రక్షణ కోసం మళ్లీ తంజావూరు ఎయిర్ ఫోర్స్ బేస్ లో తిరిగి ప్రారంభించారు.
