‘నల్లవాగు’ను పట్టించుకోండి

‘నల్లవాగు’ను పట్టించుకోండి
  • పంచాయతీల్లో కొత్త బిల్డింగులు కట్టాలి
  • వడ్ల కొనుగోళ్లలో ఇబ్బందులు రానివొద్దు  
  • జడ్పీ మీటింగ్‌లో సభ్యుల వినతి
  • కేంద్రం ఫండ్స్ కోసం ఏకగ్రీవ తీర్మానం

సంగారెడ్డి, వెలుగు: సిర్గాపూర్ మండలం సుల్తానాబాద్ పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టును పట్టించుకోవాలని స్థానిక జడ్పీటీసీ కోరారు. మంగళవారం సంగారెడ్డి జడ్పీ మీటింగ్‌ హాల్‌లో చైర్ పర్సన్ మంజుశ్రీ అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్‌కు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోస  చైర్ పర్సన్  తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం వైద్యారోగ్యం, సివిల్‌ సప్లై, వ్యవసాయ, ఉద్యాన, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, ఆర్‌‌అండ్‌బీ, నీటిపారుదల శాఖలపై చర్చ జరిపారు. సిర్గాపూర్ జడ్పీటీసీ మాట్లాడుతూ నల్లవాగు ప్రాజెక్టు పనుల విషయంలో ఈఈ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్‌‌ రూ.24 కోట్ల పనులు చేయించాల్సి ఉండగా రూ. 10 కోట్ల పనులు చేసి మొత్తం బిల్లులు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. విచారణ చేసి  పనులు కంప్లీట్ అయ్యేలా చూస్తామని అధికారులు సమాధానం ఇచ్చారు. 

209 కొనుగోలు సెంటర్లు

వడ్ల కొనుగోళ్లలో ఇబ్బందులు రానివ్వొద్దని  సభ్యు లు ప్రభాకర్, రాజు రాథోడ్, మనోజ్ రెడ్డి కోరారు. స్పందించిన డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్  జిల్లాలో ఐకేపీ ద్వారా 101, పీఏసీఎస్‌ కింద 86, డీసీఎంఎస్ ద్వారా 22 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  51 .75 లక్షల గోనె సంచులు అవసరం కాగా  ప్రస్తుతం 39.28 లక్షల సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో 4,470 ఎకరాల్లో 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టం జరిగినట్లు గుర్తించామని, మొత్తం 3,300 మంది రైతులు నష్టపోయారన్నారు. రైతుబంధు పెట్టుబడి సాయం చాలామంది రైతులకు రాలేదని పటాన్ చెరు జడ్పీటీసీ సుప్రజ సభ దృష్టికి తేగా.. బ్యాంకుల మెర్జింగ్,  సాంకేతిక కారణాలతో కొన్నిచోట్ల సమస్యలు తలెత్తాయని మంత్రి హరీశ్‌ రావు వివరించారు. త్వరలో  రైతు ల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని వెల్లడించారు.

134 జీపీలకు కొత్త బిల్డింగులు

పలువురు సభ్యులు మాట్లాడుతూ తమ పరిధిలోని గ్రామ పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరాయని, కొత్త బిల్డింగ్‌లు నిర్మించాలని కోరారు. 134 జీపీల్లో కొత్త బిల్డింగులకు రూ.26 కోట్లు శాంక్షన్ అయినట్టు డీఆర్డీవో శ్రీనివాస్ తెలిపారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఫండ్స్‌ శాంక్షన్‌ అయిన పంచాయతీలే కాకుండా ఇంకా ఎక్కడైనా పాడుబడ్డ భవనాలు ఉంటే పరిశీలించి ప్రపోజల్స్ పంపాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సర్పంచులు కనీస సమాచారం ఇవ్వడంలేదని జడ్పీటీసీలు మంత్రి దృష్టికి తెచ్చారు. తాము చేసిన పనులకు బిల్లుల మంజూరులో సహకరించడం లేదని వాపోయారు.  

 సీపీఆర్‌‌పై అవగాహన  

వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు సీపీఆర్‌‌పై అవగాహన కల్పించారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణుల కోసం జిల్లా ఆస్పత్రిలో టిపా స్కాన్ ఏర్పాటు చేశామని, రాబోయే రోజుల్లో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే డాక్టర్లను భర్తీ చేశామని, త్వరలో ఒక్క ఖాళీ లేకుండా నర్సు పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఆరోగ్య మహిళా కేంద్రాలపై అవగాహన పెంచాలని, సీపీఆర్‌‌ గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని సూచించారు. ఏఎన్ఎం సబ్ సెంటర్లకు పక్కా భవనాలు నిర్మిస్తున్నామని, 54 బిల్డింగుల నిర్మాణానికి  రూ.20 లక్షలు చొప్పున మంజూరు చేశామని  తెలిపారు. ఈ మీటింగ్‌లో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ రఘుత్తంరెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, మాణిక్ రావు, చంటి క్రాంతి కిరణ్,  కలెక్టర్ డాక్టర్ శరత్, అడిషనల్‌ కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఎంపీపీలు, జడ్పీటీసీలు కో ఆప్షన్ మెంబర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

అభివృద్ధి పనులు ప్రారంభం

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి హరీశ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.  పట్టణంలోని నాల్సాబ్ గడ్డ బస్తీ దవాఖాన, గొల్లగూడెంలో మేస్త్రీ సంఘం జిల్లా భవన నిర్మాణం, కలెక్టరేట్ వెనుక మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ ను ప్రారంభించారు. అలాగే  రాజంపేటలో పోలీస్ కన్వెన్షన్ హాల్‌కు భూమి పూజ చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అంతకుముందు  కొండాపూర్ మండలం మల్కాపూర్‌‌లో సంయుక్త ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఓపెన్ చేశారు.