
న్యూఢిల్లీ: ఇండియా సింగిల్స్ టాప్ ప్లేయర్ సుమిత్ నగాల్.. టాంపెర్ చాలెంజర్స్ టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నగాల్ 6–4, 6–3తో నికోలస్ కిక్కర్ (అర్జెంటీనా)పై గెలిచాడు. మ్యాచ్ మొత్తంలో ఒకే ఏస్ కొట్టిన సుమిత్ మూడు డబుల్ ఫాల్ట్స్ చేశాడు. తన సర్వీస్‌లో 78 శాతం పాయింట్లు సాధించాడు. 11 బ్రేక్ పాయింట్లలో ఐదింటిని కాచుకున్నాడు. ఇక మూడు డబుల్ ఫాల్ట్స్ చేసిన కిక్కర్ ఒక్క ఏస్ కూడా కొట్టలేదు. ఎనిమిది బ్రేక్ పాయింట్లలో రెండింటిని మాత్రమే కాపాడుకున్నాడు. కెరీర్‌లో ఆరు చాలెంజర్స్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన నగాల్‌కు ఈ సీజన్‌లో ఇదే బెస్ట్ పెర్ఫామెన్స్. శనివారం జరిగే సెమీస్‌లో నగాల్.. సస్చా గుయ్మార్డ్ వేయెన్‌బర్గ్ (ఫ్రాన్స్)తో తలపడతాడు.