చిన్నారుల సున్నితత్వమే ఈ కథకు కీలకం

చిన్నారుల సున్నితత్వమే ఈ కథకు కీలకం

కథా బలమున్న చిత్రాలతో  డిస్ట్రిబ్యూటర్‌‌‌‌గా, నిర్మాతగా మంచి   గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని తాజాగా నిర్మించిన సినిమా ‘సమ్మర్ హాలిడేస్’.   దర్శకుడు శ్రీకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి కీలక పాత్రల్లో నటించారు. జయసుధ, వాసుకి  కీలక పాత్రలు  పోషించారు. నవంబర్ 6న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ‘ఈ కథ విన్నప్పుడు మనసును హత్తుకుంది.  నా రియల్ లైఫ్, నా చైల్డ్​హుడ్ మెమొరీస్ గుర్తుకువచ్చాయి.

జయసుధ గారు చెప్పే డైలాగ్స్ మా అమ్మమ్మ చెప్పినట్లు, వాసుకి గారు చెప్పే మాటలు మా అమ్మ చెప్పినట్లు అనిపించాయి. ఈ కథలో చిన్నపిల్లల పాత్రలను టీనేజ్​లోకి మార్చి ఒక లవ్ స్టోరీ పెట్టి కమర్షియల్​గా మార్చవచ్చు. కానీ బాల్యంలో ఉండే ఆ ఇన్నోసెన్స్ పోతుంది. చిన్నారుల పాత్రల్లోని ఆ సున్నితత్వమే ఈ కథలో కీలకమైంది. ఇలాంటి   కథలను  చెబితే మళ్లీ పిల్లల సినిమాలు ఇండస్ట్రీలో నిర్మిస్తారని, ఆ చిత్రాలకు మా సినిమా స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్మాం.   సినిమాలో మెసేజ్ ఏమీ ఉండదు. స్నేహితులు ఎమోషన్, తండ్రీకొడుకుల ఎమోషనల్  సీన్స్ హార్ట్ టచింగ్‌‌‌‌గా ఉంటాయి.  

ఇలాంటి   స్పెషల్ అటెంప్ట్ చేసే చిత్రాలకు, కొత్త నిర్మాతలు తీసే చిన్న చిత్రాలకు, స్థానికంగా రూపొందించే సినిమాలకు ప్రభుత్వం నుంచి ఏదైనా రాయితీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే థియేటర్స్ నుంచి రెవెన్యూ తగ్గిపోయింది. ఓటీటీలు పెద్ద సినిమాలే తీసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో చిన్న సినిమాకు ప్రభుత్వం సపోర్ట్ ఇస్తే బాగుంటుంది. ప్రస్తుతం  సంగీత్ శోభన్, అనస్వరతో  ‘అంతా రాములోరు చూస్కుంటారు’   సినిమా నిర్మిస్తున్నాం.  దర్శకులు నందకిషోర్‌‌‌‌, కౌషిక్‌‌‌‌లతో సినిమాలు చేస్తున్నాం”అని చెప్పారు.