ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎండ ప్రభావం ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. అధిక చెమట.. శరీరంలో నీటి సమతుల్యత తగ్గడంతో నీరసం.. అలసట మొదలగునవి కలుగుతాయి. అందుకే వేసవికాలంలో తినే ఆహార విషయంలో చాలా శ్రద్ద తీసుకోవాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు తింటే ఫుడ్ ఫాయిజన్ అవడమే కాకుండా.. శరీరంలోవేడి ఎక్కువయి అత్యంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందుకే సమ్మర్ సీజన్ లో ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. . .!
వేసవికాలంలో శరీరాన్ని చల్లగా.. ఆరోగ్యంగా ఉంచుకోవడంచాలా ముఖ్యం. మండే ఎండల్లో కూడా శరీరాన్ని చల్లబరిచే ఆహారాన్ని తీసుకోవాలి. వేసవి కాలంలో శరీరానికి అవసరమైన లవణాలు చెమట రూపంలో బయటకు పోతాయి. శరీరంలో నీటి శాతం తగ్గిపోవడంతో డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి అందుకే తినే ఆహారంలో నీటిశాతం ఎక్కువుగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాల్లో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచి, డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతాయి.
వేసవి కాలంలో కాఫీ, టీ, ఆర్టిఫిషియల్ కూల్ డ్రింక్స్‌కు బదులుగా.. సహజసిద్ధమైన ఆహారాలు, పానీయాలను తీసుకోవాలి. అంతేకాకుండా తగినంత నీరు తాగాలి. వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండి, శరీర అంతర్గత ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. అయితే, ఫ్రిజ్‌లో ఉంచిన నీళ్లు, కూల్‌డ్రింక్స్‌ని అవాయిడ్ చేయడమే చాలామంచిది.
తీసుకోవలసిన పదార్దాలు
ఎండాకాలం తరచు కొబ్బరి నీళ్లు తాగాలి. ఇందులో పొటాషియం .. మెగ్నీషియం సమృద్దిగా ఉంటాయి. ప్రకృతి నుంచి సహజంగా ఈ నీరు వస్తుంది. అందువల్ల చెమట రూపంలో కోల్పోయిన లవణాలను శరీరానికి అందిస్తుంది.
ఉత్తర భారతదేశంలో సత్తు డ్రింక్ బాగా ఫేమస్. దీనిని వేయించిన శనగపిండితో తయారు చేస్తారు. ఇది శరీరానికి చలవ చేయడంతో పాటు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా, నిండుగా ఉంచుతుంది. మరో ముఖ్యమైన డ్రింక్ బట్టర్ మిల్క్..మజ్జిగలో కాస్త జీలకర్ర పొడి, ఉప్పు వేసుకుని తాగితే శరీరం క్షణాల్లో చల్లబడుతుంది. అంతేకాదు పెరుగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ఇంకా ఏమేమి తినాలంటే
- కీరదోసకాయ : శరీరంలోని వేడిని తగ్గించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో పీచు శాతం కూడా ఎక్కువే.
- పుచ్చకాయ : ఇందులో దాదాపు 92% నీరు ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
- సొరకాయ : ఇది సులభంగా జీర్ణమవడమే కాకుండా శరీరాన్ని కూల్ చేయడంలో సాయపడుతుంది.
- కర్బూజా : విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉండే ఈ పండు వేసవి అలసటను దూరం చేస్తుంది.
- పుదీనా : దీనికి సహజంగానే చల్లబరిచే గుణం ఉంది. దీనిని చట్నీలు, జ్యూస్‌లు లేదా మజ్జిగలో వేసుకుని తీసుకోవచ్చు.
- ఆకుకూరలు :ఆకుకూరల్లో నీటి శాతంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు ఉంటాయి.
- నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లు: వీటిలో ఉండే విటమిన్-సి ఎండ దెబ్బ తగలకుండా కాపాడుతుంది.
వేసవిలో దూరంగా ఉంచాల్సిన ఆహారాలు
ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మన జీర్ణక్రియ కాస్త మందగిస్తుంది.శరీరంలో అంతర్గత వేడినిమరింత పెంచుతాయి. అంతేకాకుండా గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణక్రియ సమస్యలకు దారితీస్తాయి. అందుకే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.
- నూనెలో బాగా వేయించిన పదార్థాలు
- మసాలాలు ఎక్కువగా ఉండే కారపు వంటకాలు
- చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు
- కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి
- పచ్చళ్లలో కారం తగ్గించాలి
