నీటి కరువు.. గుండె చెరువు.. ఎండ దెబ్బకు ఎడారిగా మారిన మాసాబ్ట్యాంక్చెరువు

నీటి కరువు.. గుండె చెరువు.. ఎండ దెబ్బకు ఎడారిగా మారిన మాసాబ్ట్యాంక్చెరువు
  • చుక్క నీరు లేక చచ్చిపోతున్న జలచరాలు

మెహిదీపట్నం, వెలుగు:  పక్క ఫొటోలో కనిపిస్తున్నది ఏదో ఎడారి ప్రాంతం కాదు.. నగరం నడిబొడ్డున ఉన్న చాచా నెహ్రూ పార్కులోని మాసాబ్​ట్యాంక్​చెరువు ‘నిర్జీవ’ చిత్రం.. కుతుబ్​షాహీల కాలంలో చుట్టుపక్కల రైతుల పొలాలకు నీళ్లిచ్చి అన్నం పెట్టిన ఈ తటాకం ఇప్పుడు మండుతున్న ఎండలకు ఆవిరైపోయింది.

 దీంతో చెరువులో చేపలు మృత్యువాతపడగా, పదుల సంఖ్యలోని బాతులు ఒక్కొక్కటిగా ప్రాణాలు కోల్పోతున్నాయి. తాగడానికి చుక్క నీరు లేక బురద నీటి దగ్గర నీటి కోసం తండ్లాడుతున్నాయి. నెర్రెలు వారిన చెరువు నేలపై చచ్చిపడిన తోటి బాతుల దగ్గర నీళ్లు పోసే వారి కోసం దీనంగా చూస్తున్నాయ్. ఇందులో ఉండే తాబేలు ఎక్కడికిపోయిందో తెలియడం లేదు. 

చెరువుతో పాటు పార్కులోని మూడు బోర్లు పూర్తిగా ఎండిపోగా, చెట్ల కోసం ట్యాంక్ బండ్ నుంచి రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువచ్చి పోస్తున్నామని పార్కు నిర్వాహకులు చెప్తున్నారు. వారం కింద నాలుగు ట్యాంకర్లను చెరువులో పోసినా ప్రయోజనం లేకపోయిందంటున్నారు. రెండు మూడు రోజులు ఇలాగే కొనసాగితే ఈ చెరువులో జలచరాల కళేబరాలే మిగులుతాయ్.. ఇప్పటికైనా అధికారులు వాటిని కాపాడే ప్రయత్నం చేయాలని పలువురు కోరుతున్నారు .

గత మెంతో ఘనం 

క్రీ.శ 1624లో కుతుబ్ షాహీ వంశానికి చెందిన ఐదో సుల్తాన్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా తల్లి ఖానుమ్ అఘా ఈ చెరువును నిర్మించారు. తర్వాత, ఆరో సుల్తాన్ భార్య అయిన హయాత్ భక్షీ బేగమ్​కు ఉన్న ‘మా సాహెబా’ అనే గౌరవ బిరుదు మీదుగా దీనికి ‘మా సాహెబా తలాబ్’ అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ‘మా సాహెబా ట్యాంక్’ మాసాబ్​ట్యాంక్ గా మారింది. 

 అప్పట్లో వర్షాలు పడ్డప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కొండలపై నుంచి వచ్చే వరద ఈ చెరువులోకి చేరేది. ఈ కాంక్రీట్​యుగంలో చుట్టూ పెద్ద పెద్ద భవనాలు ఏర్పడడంతో చెరువులోకి వరద రావడం నిలిచిపోయింది. దీంతో చెరువు పూర్తిగా ఎండిపోయి కనుమరుగైపోయిందని చెప్పుకోవచ్చు. ఆ స్థలంలోనే 13 ఎకరాల విస్తీర్ణంలో చాచా నెహ్రూ పార్క్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పార్కు లోపల ఉన్నది దాని అవశేషం మాత్రమే..దాన్నీ కాపాడుకోలేకపోతే ఓ చరిత్ర అంతమైపోయినట్టే...