
సెలెక్టర్‌గా హర్విందర్ సింగ్ వెంకీ, శివరామ్, రాజేశ్‌కు నిరాశే
ముంబై: సస్పెన్స్‌కు తెరపడింది. ఎమ్మెస్కే ప్రసాద్ వారసుడు ఎవరో తెలిసిపోయింది. తనకంటే పేరు, అనుభవం ఉన్న వాళ్లను వెనక్కునెట్టిన ఇండియా మాజీ స్పిన్నర్ సునీల్ జోషి నేషనల్ క్రికెట్ సెలెక్షన్ ప్యానెల్ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. అతనితో పాటు మాజీ పేసర్ హర్విందర్ సింగ్‌ను సెలెక్టర్‌గా ఎంపిక చేసినట్టు బీసీసీఐ క్రికెటర్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) బుధవారం ప్రకటించింది. ఐదుగురు సభ్యుల కమిటీలో ఇప్పటిదాకా చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్ స్థానంలో జోషి (సౌత్ జోన్) బాధ్యతలు చేపట్టనుండగా, సెలెక్టర్ గగన్ ఖోడా ప్లేస్‌లో హర్విందర్ సింగ్ (సెంట్రల్ జోన్) కమిటీలోకి వచ్చాడు. దాంతో బీసీసీఐ మరోసారి జోనల్ పాలసీకి కట్టుబడింది.
కమిటీలో మిగతా సభ్యులైన జనిత్ పరాంజపే (వెస్ట్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్), శరణ్‌దీప్ సింగ్ (నార్త్) పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుంది. కాగా, ఖాళీ అయిన రెండు పోస్టుల కోసం వచ్చిన 40 దరఖాస్తుల నుంచి షార్ట్‌లిస్ట్ చేసిన ఐదుగురిని మదన్ లాల్, ఆర్‌పీ సింగ్, సులక్షణా నాయక్‌తో కూడిన సీఏసీ ఇంటర్వ్యూ చేసింది. ఈ లిస్ట్‌లో జోషి, హర్విందర్‌తో పాటు వెంకటేశ్ ప్రసాద్, రాజేశ్ చౌహాన్, శివరామకృష్ణన్ ఉన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించిన జోషి, హర్విందర్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు సీఏసీ తెలిపింది. ముఖ్యంగా జోషి ముక్కుసూటితనం తమకు నచ్చిందని, బంగ్లాదేశ్ సపోర్ట్ స్టాఫ్‌గా పని చేసిన అనుభవం కూడా ఉండటంతో అతని వైపు మొగ్గు చూపామని మదన్‌లాల్ చెప్పారు. 49 ఏళ్ల జోషి 15 టెస్టులు, 69 వన్డేల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 42 ఏళ్ల హర్విందర్ మూడు టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. ఏడాది తర్వాత సెలెక్షన్ ప్యానెల్ పనితీరును సమీక్షించనున్న సీఏసీ అవసరమైన సిఫారసులు చేయనుంది.
రేసులోనే అగార్కర్..
సెలెక్షన్ కమిటీ చైర్మన్ అవుతాడని భావించిన మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌ను కనీసం ఇంటర్వ్యూకు కూడా పిలవకపోవడం చర్చనీయాంశమైంది. అయితే, సెప్టెంబర్‌లో ఖాళీ అయ్యే జతిన్, దేవాంగ్, శరణ్‌దీప్ స్థానాల కోసం జరిగే తదుపరి ఇంటర్వ్యూలకు అగర్కార్ ఆటోమేటిక్‌గా అర్హుడవుతాడని బోర్డు ప్రెసిడెంట్ గంగూలీ చెప్పాడు. అజిత్‌తో పాటు ఈసారి దరఖాస్తు చేసిన వాళ్లు మరోసారి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. నవంబర్‌లో కొత్త సెలెక్టర్లను ఎంపిక చేసే చాన్సుంది.
ధోనీ ఫ్యూచర్‌ను, కోహ్లీ స్టేచర్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారు?
ఇంటర్వ్యూలకు హాజరైన ఐదుగురు అభ్యర్థులను సీఏసీ కామన్‌గా కొన్ని ప్రశ్నలు అడిగింది. ‘ఇండియా టీమ్‌లో మహేంద్ర సింద్ ధోనీ ఫ్యూచర్‌పై మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?. కెప్టెన్ విరాట్ కోహ్లీ స్టేచర్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారు?’ అని ప్రశ్నించింది. మహీని వచ్చే టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేస్తారా? అని కూడా అడిగింది. ఈ విషయాన్ని బోర్డు సీనియర్ అధికారి వెల్లడించారు. అలాగే, ‘మీరు కేవలం చైర్మన్ పోస్టు మాత్రమే కోరుకుంటున్నారా? లేక సెలెక్టర్‌గా కూడా పని చేస్తారా?’అని కొంత మంది అభ్యర్థులను సీఏసీ ప్రశ్నించింది. అయితే, శివరామ్.. ఒకరి కింద పని చేసేందుకు ఇష్టపడలేదని సమాచారం. అదే సమయంలో సెలెక్టర్‌గా ఉండేందుకు కూడా జోషి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది.