హైదరాబాద్, వెలుగు: ఐపీఎల్‌లో సొంతగడ్డపై వరుస విజయాలతో ఊపు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేసింది. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండు జట్లు మూడు విజయాలు, ఆరేసి పాయింట్లతో ఉన్నప్పటికీ, మెరుగైన రన్‌రేట్ కారణంగా హైదరాబాద్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
సొంతగడ్డపై వరుసగా మూడో విజయాన్ని అందుకొని పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది. కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోయినా, సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం అనూహ్యంగా పుంజుకుంది. యువ పేసర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్, ఈషాన్ మలింగ తమ ప్రతిభతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు.
అయితే, బ్యాటింగ్ విభాగం మాత్రం నిలకడలేమితో సతమతమవుతోంది. గత పోరులో మెరుపు ఫిఫ్టీతో అభిషేక్ శర్మ ఫామ్ అందుకున్నా మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్, కెప్టెన్ ఇషాన్ కిషన్ నిలకడగా రాణించడం లేదు. దీంతో మిడిలార్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్ పైనే భారీగా ఒత్తిడి పడుతోంది. దాంతో ఢిల్లీపై బ్యాటర్లంతా హిట్టవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కేఎల్ రాహుల్, పాథుమ్ నిశాంక, ట్రిస్టన్ స్టబ్స్ వంటి నాణ్యమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నారు. బౌలింగ్‌లో లుంగి ఎంగిడి ఏడు వికెట్లతో రాణిస్తుండగా, కెప్టెన్ అక్షర్ పటేల్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు.

