
ఐపీఎల్ అభిమానులకు శుభవార్త. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2023 సీజన్ మరో 15 రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 31 నుంచి మే 28 వరకు ఈ లీగ్ జరగనుంది. మొత్తం 12 వేదికల్లో 74 మ్యాచులు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్కు మాత్రం అహ్మదాబాద్ వేదికగా నిర్వహించనున్నారు.
గతేడాది కరోనా కారణంగా మ్యాచులన్నీ మహారాష్ట్రలోనే జరగ్గా..ఈ సారి ఆయా టీంల హోంగ్రౌండ్ లో ఐపీఎల్ మ్యాచులను నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచులు ఆడేందుకు సన్ రైజర్స్ సిద్దమవుతోంది. ఇందులో భాగంగా ఉప్పల్లో జరిగే రెండు ఐపీఎల్ మ్యాచుల టికెట్లను సన్ రైజర్స్ హైదరాబాద్ విడుదల చేసింది.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ల టికెట్స్ను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్. ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్, ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్ల టికెట్స్ను ఆన్ లైన్లో అందుబాటులో ఉంచింది.పేటీఎం ఇన్సైడర్ యాప్లో ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చని సూచించింది. మొదటి 10 వేల టికెట్స్ను బుక్ చేసుకున్న వారికి 25% డిస్కౌంట్ను అందిస్తోంది. ప్రతీ రెండు టికెట్ల కొనుగోలు పై SRH జెర్సీ ని ఉచితంగా ఇస్తోంది.