ఆర్సీబీకి షాక్‌ .. 42 రన్స్‌‌‌‌ తేడాతో సన్​రైజర్స్‌‌‌‌ గ్రాండ్​ విక్టరీ

ఆర్సీబీకి షాక్‌ .. 42 రన్స్‌‌‌‌ తేడాతో సన్​రైజర్స్‌‌‌‌ గ్రాండ్​ విక్టరీ

లక్నో: ఐపీఎల్‌‌‌‌–18లో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌పై కన్నేసిన రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరుకు సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ షాకిచ్చింది. ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (48 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌లతో 94 నాటౌట్‌‌‌‌) దంచికొట్టడంతో.. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ 42 రన్స్‌‌‌‌ తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. టాస్‌‌‌‌ ఓడిన హైదరాబాద్‌‌‌‌ 20 ఓవర్లలో 231/6 స్కోరు చేసింది. 

అభిషేక్‌‌‌‌ శర్మ (34), క్లాసెన్‌‌‌‌ (24), అనికేత్‌‌‌‌ వర్మ (26) ఫర్వాలేదనిపించారు. తర్వాత బెంగళూరు 19.5 ఓవర్లలో 189 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. ఫిల్‌‌‌‌ సాల్ట్‌‌‌‌ (62) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. కోహ్లీ (43) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. కమిన్స్‌‌‌‌ 3, మలింగ 2 వికెట్లు తీశారు. ఇషాన్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఈ భారీ ఓటమితో బెంగళూరు రెండు నుంచి మూడో ప్లేస్‌కు పడిపోయింది. 

కీలక భాగస్వామ్యాలు..

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన హైదరాబాద్‌‌‌‌కు ఓపెనర్లు అభిషేక్‌‌‌‌ శర్మ, ట్రావిస్‌‌‌‌ హెడ్‌‌‌‌ (17) మెరుపు ఆరంభాన్నిచ్చినా ఇషాన్‌‌‌‌ కీలక భాగస్వామ్యాలతో భారీ స్కోరు అందించాడు. మొదట్లో హెడ్‌‌‌‌ 4, 4, 4తో టచ్‌‌‌‌లోకి రాగా అభిషేక్‌‌‌‌ వెంటవెంటనే 4, 6, 4, 6, 6, 4తో దంచుడు మొదలుపెట్టాడు. కానీ నాలుగో ఓవర్‌‌‌‌ చివరి బాల్‌‌‌‌కు ఎంగిడి (1/51) బౌలింగ్‌‌‌‌లో వెనుదిరగడంతో తొలి వికెట్‌‌‌‌కు 54 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. మూడు బాల్స్‌‌‌‌ తర్వాత భువనేశ్వర్‌‌‌‌ (1/43).. హెడ్‌‌‌‌ను బోల్తా కొట్టించడంతో ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌హెచ్‌‌‌‌ 54/2తో నిలిచింది.

ఈ దశలో వచ్చిన ఇషాన్‌‌‌‌.. బెంగళూరు బౌలింగ్‌‌‌‌ను దీటుగా ఎదుర్కొని పరుగుల వరద పారించాడు. మిగతా వారు ఉన్నంతసేపు తమ వంతు సహకారాన్ని అందించారు. ఆరో ఓవర్‌‌‌‌లో క్లాసెన్‌‌‌‌ 4, ఇషాన్‌‌‌‌ 6తో పవర్‌‌‌‌ప్లేలో హైదరాబాద్‌‌‌‌ 71/2 స్కోరు చేసింది. ఏడో ఓవర్‌‌‌‌లో క్లాసెన్‌‌‌‌ రెండు సిక్స్‌‌‌‌లతో జోరు పెంచినా 9వ ఓవర్‌‌‌‌లో వెనుదిరిగాడు. ఇదే ఓవర్‌‌‌‌లో ఇషాన్‌‌‌‌ మూడు ఫోర్లు బాదాడు. 10వ ఓవర్‌‌‌‌లో ఇషాన్‌‌‌‌ సిక్స్‌‌‌‌తో స్కోరు 113/3కి పెరిగింది. 11వ ఓవర్‌‌‌‌లో అనికేత్‌‌‌‌ వర్మ 6, 4, 6తో 19 రన్స్‌‌‌‌ రాబట్టాడు.

కానీ తర్వాతి ఓవర్‌‌‌‌లో మరో సిక్స్‌‌‌‌ కొట్టి వెనుదిరగడంతో నాలుగో వికెట్‌‌‌‌కు 43 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత సిక్స్‌‌‌‌, ఫోర్‌‌‌‌తో ఇషాన్‌‌‌‌ 28 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. 10 బాల్స్‌‌‌‌ తర్వాత షెఫర్డ్‌‌‌‌ (2/14) దెబ్బకు నితీశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ (4) ఔటయ్యాడు. అభినవ్‌‌‌‌ మనోహర్‌‌‌‌ (12) సిక్స్‌‌‌‌తో ఖాతా తెరిచినా షెఫర్డ్‌‌‌‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మధ్యలో ఇషాన్‌‌‌‌ మాత్రం 4, 6, 6, 4, 6 జోరు తగ్గనీయలేదు. చివర్లో సిక్స్‌‌‌‌ కొట్టిన కమిన్స్‌‌‌‌ (13 నాటౌట్‌‌‌‌) ఏడో వికెట్‌‌‌‌కు 43 రన్స్‌‌‌‌ జత చేయడంతో ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌హెచ్‌‌‌‌ భారీ టార్గెట్‌‌‌‌ నిర్దేశించింది. 

ఆఖర్లో తడబాటు..

ఛేజింగ్‌‌‌‌లో ఆర్సీబీకి కోహ్లీ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. తొలి ఓవర్‌‌‌‌లో ఫోర్‌‌‌‌ మొదలుపెట్టిన విరాట్‌‌‌‌ ఆ తర్వాత వరుస విరామాల్లో మరో ఆరు బౌండ్రీలు బాదాడు. 3 రన్స్ వద్ద క్యాచ్ ఔటైనా నో బాల్ కావడంతో బతికిపోయిన సాల్ట్‌‌‌‌ తొలుత జాగ్రత్తగా ఆడుతూ విరాట్‌కు అండగా నిలిచాడు. ఆరో ఓవర్‌‌‌‌లో కోహ్లీ 6, సాల్ట్‌‌‌‌ 4, 6 దంచడంతో పవర్‌‌‌‌ప్లేలో ఆర్సీబీ 72/0కి చేరింది. అయితే ఏడో ఓవర్‌‌‌‌లో అనూహ్యంగా కోహ్లీ ఔట్‌‌‌‌ కావడంతో తొలి వికెట్‌‌‌‌కు 80 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. 

మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ (11) నెమ్మదిగా ఆడినా సాల్ట్‌‌‌‌ 6, 4, 4, 6, 6, 4తో 27 బాల్స్‌‌‌‌లోనే హాఫ్‌‌‌‌ సెంచరీ సాధించాడు. దీంతో సగం ఓవర్లకు స్కోరు 118/1కి పెరిగింది. కానీ 11వ ఓవర్‌‌‌‌లో నితీశ్‌‌‌‌ (1/13) మయాంక్‌‌‌‌ను పెవిలియన్‌‌‌‌కు పంపడంతో రెండో వికెట్‌‌‌‌కు 40 రన్స్‌‌‌‌ పార్ట్‌నర్‌‌షిప్ ముగిసింది.  వెంటనే మరో సిక్స్‌‌‌‌ కొట్టిన సాల్ట్‌‌‌‌ రెండు బాల్స్‌‌‌‌ తర్వాత వెనుదిరిగాడు. సిక్స్‌‌‌‌తో ఖాతా ఓపెన్‌‌‌‌ చేసిన స్టాండిన్ కెప్టెన్ జితేశ్‌‌‌‌ శర్మ (24) 4, 6 బాదగా.. ఇంపాక్ట్ ప్లేయర్‌‌గా వచ్చిన రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌ (18) స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేయడంతో 15వ ఓవర్లకు 167/3తో ఆర్సీబీ రేసులో నిలిచింది. 

కానీ, నిలకడగా సాగుతున్న ఇన్నింగ్స్‌‌‌‌కు 16వ ఓవర్‌‌‌‌లో డబుల్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ తగిలింది. మూడు బాల్స్‌‌‌‌ తేడాలో పటీదార్‌‌‌‌, రొమారియో షెఫర్డ్‌‌‌‌ (0)తో పాటు తర్వాతి ఓవర్‌‌‌‌ రెండో బాల్‌‌‌‌కు జితేశ్‌‌‌‌ వెనుదిరిగాడు. నాలుగో వికెట్‌‌‌‌కు 44 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగియడంతో పాటు ఐదు బాల్స్‌‌‌‌ తేడాలో మూడు కీలక వికెట్లు పడటంతో ఆ జట్టు డీలా పడింది. ఇక మూడు ఓవర్లలో 53 రన్స్‌‌‌‌ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో క్రునాల్‌‌‌‌ పాండ్యా (8), టిమ్‌‌‌‌ డేవిడ్‌‌‌‌ (1), భువనేశ్వర్‌‌‌‌ (3), యష్‌‌‌‌ దయాల్‌‌‌‌ (3) ఔట్‌‌‌‌ కావడంతో టార్గెట్‌‌‌‌ను అందుకోలేకపోయింది.  

సంక్షిప్త స్కోర్లు

హైదరాబాద్‌‌‌‌: 20 ఓవర్లలో 231/6 (ఇషాన్‌‌‌‌ 94*, అభిషేక్‌‌‌‌ 34, షెఫర్డ్‌‌‌‌ 2/14). 
బెంగళూరు: 19.5 ఓవర్లలో 189 ఆలౌట్‌‌‌‌ (సాల్ట్‌‌‌‌ 62, కోహ్లీ 43, కమిన్స్‌‌‌‌ 3/28, మలింగ 2/37).