
ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. సోమవారం (మే 19) లక్నో సూపర్ జయింట్స్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఛేజింగ్ లో అభిషేక్ శర్మ (20 బంతుల్లో 59:4 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీకి తోడు క్లాసన్ (47),మెండీస్ (32) రాణించి సన్ రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఓటమితో లక్నో అధికారికంగా ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ 18.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.
206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అథర్వ థైదే (13) రెండో ఓవర్లో ఔటయ్యాడు. ఈ దశలో సన్ రైజర్స్ ను అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. లక్నో బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీలతో చెలరేగారు. ఓ వైపు అభిషేక్ శర్మ బౌండరీలతో చెలరేగితే.. మరో ఎండ్ లో కిషాన్ మంచి సహకారం అందించాడు. దీంతో పవర్ ప్లే లో హైదరాబాద్ 72 పరుగులు చేసింది. ఏడో ఓవర్లో అభిషేక్ శర్మ శివాలెత్తాడు. రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది 26 పరుగులు రాబట్టాడు. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా సన్ రైజర్స్ వైపు మళ్లింది.
ALSO READ | LSG vs SRH: 7 పరుగులకే పంత్ ఔట్.. కోపంతో బాల్కనీ నుంచి వెళ్లిపోయిన సంజీవ్ గోయెంకా
ఈ క్రమంలో అభిషేక్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న అభిషేక్ కు 8 ఓవర్లో దిగ్వేశ్ ఔట్ చేసి లక్నోకి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. వికెట్ పడినా సన్ రైజర్స్ దూకుడు తగ్గలేదు. ఇషాన్ కిషాన్, క్లాసన్ బౌండరీలతో ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. కిషాన్ 35 పరుగులు చేసి ఔటైనా.. క్లాసన్ (47) మాత్రం చివరి వరకు క్రీజ్ లో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. కామిందు మెండీస్ (32) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ రెండు.. విలియం ఓరూర్కే, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ చేసి బౌలర్లపై భారం వేసింది. ఓపెనర్లు మార్కరం(38 బంతుల్లో 61:4 ఫోర్లు, 4 సిక్సర్లు), మిచెల్ మార్ష్(39 బంతుల్లో 65:6 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు.. పూరన్ మెరుపులు (45) మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. మార్ష్ (65) టాప్ స్కోరర్ గా నిలిచాడు. సన్ రైజర్స్ బౌలర్లలో మలింగా రెండు.. హర్ష దూబే, హర్షల్ పటేల్, నితీష్ రెడ్డి తలో వికెట్ తీసుకున్నారు.
The first 200+ target chased in the IPL in Lucknow 👏
— ESPNcricinfo (@ESPNcricinfo) May 19, 2025
🔗 https://t.co/wiwAaEcIwT | #IPL2025 pic.twitter.com/0C8XgLjszi