భారతీయ సినీ చరిత్రలో అరుదైన మైలురాయిని చేరుకున్న ఇద్దరు దిగ్గజ నటులు సూపర్‌స్టార్ రజనీకాంత్, నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ ఆగ్ర నటులకు ప్రతిష్టాత్మక గౌరవం దక్కనుంది. సినీ పరిశ్రమలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా.. 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI – 2025) ముగింపు వేడుకల్లో వీరిద్దరిని సన్మానించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ శుభవార్తను కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
రజనీ, బాలయ్యలకు అరుదైన గౌరవం..
లెజెండరీ నటులు రజనీకాంత్, నందమూరి బాలకృష్ణలు సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇది భారతీయ సినిమా రంగంలో ఒక చారిత్రక మైలురాయి నిలుస్తోంది. వారి అద్భుతమైన నటన, విశేష ప్రజాదరణతో దశాబ్దాలుగా భారతీయ కథాకథనాన్ని తీర్చిదిద్దడంలో గొప్ప కృషి చేశారు. వారి ఐకానిక్ పనితీరును, అపారమైన ప్రభావాన్ని గుర్తించి..56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు వేడుకల్లో వారిని ప్రత్యేకంగా సన్మానించనున్నాం అని డాక్టర్ మురుగన్ తెలిపారు.
సినీ మహోత్సవం..
గోవాలోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ఈ 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI – 2025) ఘనంగా జరగనున్నాయి. పది రోజుల పాటు జరగనున్న ఈ సినీ మహోత్సవం వేడుకలు నవంబర్ 20న ప్రారంభమై.. నవంబర్ 28న ముగుస్తుంది. ఈసారి ప్రారంభోత్సవం గతంలో కంటే భిన్నంగా పనాజీలోని డీబీ బందోద్కర్ రోడ్‌లో గ్రాండ్ ఫ్లోట్ పరేడ్‌తో మొదలుకానుంది.
84 దేశాల నుండి దాదాపు 270 చిత్రాల ప్రదర్శన..
ఈ 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI – 2025) వేడుకల్లో 84 దేశాల నుండి దాదాపు 270 చిత్రాలను ప్రదర్శించనున్నారు. స్పెయిన్ భాగస్వామ్య దేశంగా, ఆస్ట్రేలియా స్పాట్‌లైట్ దేశంగా ఉండనున్నాయి. స్పెయిన్ భాగస్వామ్య దేశంగా, ఆస్ట్రేలియా స్పాట్‌లైట్ దేశంగా ఉండనున్నాయి. కేన్స్, బెర్లినాలే, వెనిస్ వంటి ప్రధాన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రశంసలు పొందిన చిత్రాలు కూడా ఇక్కడ ప్రదర్శించబడతాయి. ఈ ఎడిషన్ కోసం ఇప్పటికే 7,500 మంది ప్రతినిధులు (Delegates) రిజిస్టర్ చేసుకున్నారు.
►ALSO READ | Jayakrishna: ఘట్టమనేని వారసుడు గ్రాండ్ ఎంట్రీ.. జయకృష్ణకు జోడీగా రవీనా టాండన్ కుమార్తె!
లెజెండరీ ప్రయాణం
1975లో 'అపూర్వ రాగంగళ్' చిత్రంతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన రజనీకాంత్, ఆ తర్వాత స్టైల్, నటనతో దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన కమర్షియల్ స్టార్‌గా ఎదిగారు. ఆయన దక్షణాది సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక 100కు పైగా చిత్రాల్లో నటించిన బాలకృష్ణ, 'సమరసింహా రెడ్డి', 'సింహా', 'ఆదిత్య 369', 'ముద్దుల మావయ్య' వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు సినిమాలోని మాస్ హీరోల్లో చిరస్థాయిగా నిలిచారు. ప్రస్తుతం ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నారు, 'అఖండ 2' వంటి భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సినీ నటుడిగా, టీడీపీ ఎమ్మెల్యేగా ప్రజాసేవలోనూ చురుగ్గా ఉన్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలను ఒకే వేదికపై సన్మానించడం భారతీయ సినీ అభిమానులకు విందు కానుంది.
