మూఢనమ్మకాలకు వందల కోట్లు ఖర్చు

మూఢనమ్మకాలకు వందల కోట్లు ఖర్చు

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ మూఢనమ్మకాలు, వాస్తు సెంటిమెంట్‌‌ కోసం సెక్రటేరియట్ కూల్చివేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆదేశాల మేరకే సీఎస్ సోమేశ్​కుమార్, డీజీపీ మహేందర్‌‌రెడ్డి సెక్రటేరియట్‌‌లో నల్ల పోచమ్మ గుడిని, మసీదును కూల్చి వేశారని… ఈ ముగ్గురిపైనా క్రిమినల్ కేసులు పెట్టి చర్లపల్లి జైలుకు పంపాలన్నారు. సెక్రటేరియట్‌‌లో 16 మంది సీఎంలు పని చేశారని, వారి కొడుకు ఎవరూ సీఎంలు కాకపోవడమే వాస్తు దోషంగా కేసీఆర్ భావిస్తున్నారని అన్నారు. కేటీఆర్‌‌ను సీఎం చేసేందుకే మూఢనమ్మకాల పేరిట వాస్తు కోసం సెక్రటేరియట్‌‌ కూల్చివేస్తున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్‌‌లోని మల్కాజ్‌‌గిరి పార్లమెంట్ ఆఫీసులో సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, కొండా విశ్వేశ్వరరెడ్డిలతో కలిసి రేవంత్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘నల్లపోచమ్మ గుడి, మసీదును కుల్చారు. తెలంగాణ ఉద్యమానికి నల్లపోచమ్మ గుడి వేదికైంది. కేసీఆర్ వాటిని కూల్చి ఆ వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారు’ అని చెప్పారు. ‘ఉద్యోగ సంఘాలకు నరేందర్ రావు, ముస్లిం మతాచారాలకు అసదుద్దీన్ ఒవైసీ వకల్తా ఏమీ కాదు. మందిర్, మసీదు పేరుతో ఎంతో మంది ప్రాణాలు బాలిగొన్నది ఎవరో అందరికీ తెలుసు. సెక్రటేరియట్… గుడి కూల్చివేతపై కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి స్పందించాలి. మజ్లిస్, బీజేపీ, టీఆర్ఎస్ అన్ని ఒకే తాను ముక్కలు. మందిరాల కూల్చివేతను సపోర్ట్‌‌ చేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులను చెప్పుతో కొట్టాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా. వాస్తు పేరుతో కేసీఆర్ రూ.వందల కోట్లు వృథా చేస్తున్నారు’ అని అన్నారు.

కేసీఆర్ సొంత ఆస్తులు కాదు: షబ్బీర్ అలీ

సెక్రటేరియట్‌‌లో మసీదు, గుడులను మళ్లీ కట్టిస్తానని సీఎం కేసీఆర్​ చెప్పడం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. ఇవేమీ కేసీఆర్​ సొంత ఆస్తులు కావని… ప్రజల సెంటిమెంట్‌‌కు సంబంధించిన అంశాలని అన్నారు.

నిజామాబాద్ సర్కార్ ఆస్పత్రిలో ఒకేరోజు నలుగురు మృతి