ప్రాణహిత వరద బాధితులను ఆదుకోండి

ప్రాణహిత వరద బాధితులను ఆదుకోండి
  • సీఎం రేవంత్​కు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లేఖ

హైదరాబాద్, వెలుగు: ప్రాణహిత నది వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన సీఎం రేవంత్‌‌ కు లేఖ రాశారు. ప్రాణహిత వరదల వల్ల చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలోని 1,985 మంది రైతులకు చెందిన 3,725 ఎకరాల్లో పంటలు నీట మునిగాయన్నారు. 

అప్పు చేసి సాగు చేసిన పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని లేఖలో పేర్కొన్నారు. రైతులు ఆర్థికంగా నష్టపోయారని, వారికి వెంటనే నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని వివేక్ కోరారు. ప్రాణహిత వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులతో సర్వే చేయించి, పంటల రిహాబిలిటేషన్‌‌ కు చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక మేటలు వేసిన రైతు పొలాల్లో మళ్లీ వ్యవసాయం చేసుకునేలా రైతులకు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.