నవీపేట్, వెలుగు: తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు రక్ష బంధన్ సందర్భంగా జీపీ కార్మికులు రాఖీలు కట్టి మద్దతు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లు, సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కేంద్రానికి చెందిన జీపీ కార్మికులు పాల్గొన్నారు.
ఎస్సారెస్పీకి పెరిగిన ఇన్ ఫ్లో
మరో మూడు గేట్లు ఎత్తిన ఆఫీసర్లు
మెండోరా, వెలుగు: ఎస్సారెస్పీకి ఎగువ ప్రాంతాల నుంచి 48,781 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నట్లు ప్రాజెక్ట్ ఏఈ రవి తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు 39,200 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా నాలుగు గేట్లను ఎత్తి16,656 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలిన ఆఫీసర్లు, ఒక గంట వ్యవధిలో 48,781క్యూసెక్కుల ఇన్ ఫ్లో పెరగడంతో మరో మూడు గేట్లను ఎత్తి మొత్తం ఏడు గేట్ల ద్వారా 24,984 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కాకతీయ కాల్వకు 3 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 5 వేల క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 5 వేల క్యూసెక్కుల నీరు విడుదల జరుగుతుందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1089.00 అడుగులు 79.620 టీఎంసీలుగా ఉంది.
నేడు జాబ్ మేళా
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి కలెక్టరేట్‌లో హెచ్‌సీఎల్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లా
కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో ఉదయం 9 గంటలకు జరిగే ఈ జాబ్‌మేళాకు ఎంపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో 60 శాతం మార్కులతో 2021-22లో ఉత్తీర్ణత పొందిన ఇంటర్ స్టూడెంట్లు పాల్గొనాలని తెలిపారు.
హిందూ సంస్కృతిని పరిరక్షించాలి
ఆర్మూర్, వెలుగు: హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలంగాణ ప్రాంత గోసేవా ప్రముఖ్ జగన్మోహన్‌చారి అన్నారు. శుక్రవారం ఆర్మూర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ మహోత్సవంలో ఆయన మాట్లాడారు. గోరక్షణ మహా పుణ్యమన్నారు. కులాల పేరుతో రాజకీయం తగదని, హిందువులందరూ ఐక్యంగా ఉన్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. కరోనా వంటి విపత్తును ఎదుర్కొని ఇతర దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత భారత్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్ వెంకట్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ జెస్సు అనిల్, పోల్కం వేణు, అల్జాపూర్ దేవేందర్ పాల్గొన్నారు.
దేశ గొప్పతనాన్ని తెలియజేయాలి
బోధన్, వెలుగు: భారతదేశ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికీ తెలిసే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే షకీల్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో వజ్రోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వజ్రోత్సవాలకు అన్ని మతాల చెందిన మత గురువులు రావడం అభినందనీయమన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాలను ఎగరవేసి దేశ గొప్పతనాన్ని చాటాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రామరావు, తహసీల్దార్ వరప్రసాద్, సీఐ ప్రేమ్‌కుమార్, టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ రవీంద్రయాదవ్ పాల్గొన్నారు.
అంతకుముందు రక్షాబంధన్ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆయనకు మహిళ ప్రజాప్రతినిధులు రాఖీలు కట్టారు.
ఇద్దరు పేదలకు ఇండ్ల నిర్మాణం
కామారెడ్డి, వెలుగు: బీబీపేట మండలం జనగామకు చెందిన వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి తన భర్త్‌డే సందర్భంగా తమ సొంత ఊరిలో ఇద్దరు పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. బీబీపేట మండల కేంద్రంలోని హైస్కూల్‌లో ఆయన అభిమానులు సుభాష్‌రెడ్డి భర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఘనంగా రక్షా బంధన్
అన్నా..చెల్లెళ్ల ఆత్మీయతకు ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి వేడుకలను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా తమతమ సోదరులకు రాఖీ కట్టేందుకు ఆడబిడ్డలు సొంతూళ్లకు రావడంతో ఇండ్లన్నీ కలకలలాడాయి. కామారెడ్డిలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ బి.శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, ఇతర ఆఫీసర్లకు బాల సదనం చిన్నారులు రాఖీలు కట్టారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌కు ఆయన అక్కలు రాఖీలు కట్టారు. నిజామాబాద్‌లో ని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ సమైక్యత సామూహిక రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ నాగరాజు, డీసీపీ అరవింద్ బాబు, మహిళా పోలీసులు పాల్గొన్నారు.
బీజేపీ హయాంలోనే దేశాభివృద్ధి
నిజామాబాద్/బోధన్/ఆర్మూర్, వెలుగు: బీజేపీ హయాంలోనే దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని ఆ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఇందూరు నగరంలో శుక్రవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ పాలనలో అట్టడుగు స్థాయి వరకు దేశ ఆర్థిక ఫలాలు అందుతున్నాయన్నారు. 15న ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రెసిడెంట్ సందగిరి రాజశేఖర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు న్యాలం రాజు, పోతన్‌కర్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ నాగోళ్ల లక్ష్మీనారాయణ, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమందు విజయ్, బీజేపీ నేతలు బంటు ప్రవీణ్, చిరంజీవి, మాస్టర్ శంకర్, ఆకుల శ్రీనివాస్, బూరుగుల వినోద్, వినోద్‌రెడ్డి, రోషన్, గడ్డం రాజు, పుట్ట వీరేందర్, కొత్త వేణు, దొంతుల రవి పాల్గొన్నారు. బోధన్‌లో నిర్వహించిన ర్యాలీని సీనియర్ నేత వడ్డి మోహన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించగా టౌన్ ప్రెసిడెంట్కొలిపాక బాలరాజ్, మాజీ బీజేపీ ఫ్లోర్‌లీడర్ రామరాజు, బీజేపీ, బీజేవైయం నాయకులు పాల్గొన్నారు. ఆర్మూర్‌లో జరిగిన ర్యాలీలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, మాజీ మున్సిపల్‌చైర్మన్ కంచెట్టి గంగాధర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నర్సింహారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ అనిల్, ఆకుల రాజు, వేణు ప్రశాంత్ పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమాన్ని మరిచిన ప్రభుత్వాలు
ధర్పల్లి, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. వజ్రోత్సవాల్లో భాగంగా ధర్పల్లి నుంచి ఓన్నాజీపేట్ వరకు శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. ఎనిమిదేళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలకు మాయమాటలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నాయన్నారు. వీరి పాలనపై ప్రజలు విసిగి పోయారని, కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, రూరల్ ఇన్‌చార్జి భూపతిరెడ్డి, జిల్లా నాయకులు ముప్ప గంగారెడ్డి, మండల అధ్యక్షుడు ఆర్మూర్ బాలరాజ్, కాంగ్రెస్ ప్రతినిధులు చెలమెల నర్సయ్య పాల్గొన్నారు.
