తెలంగాణలో జ్యోతిష్యం ఆధారంగా ఎన్నికలొస్తయ్

తెలంగాణలో జ్యోతిష్యం ఆధారంగా ఎన్నికలొస్తయ్

న్యూఢిల్లీ, వెలుగు: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై నమోదైన కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ఎన్నికలు జ్యోతిష్యం ఆధారంగా వస్తాయంటూ ధర్మాసనం కామెంట్​ చేసింది. 2018 ఎన్నికల్లో గోషామహల్ నుంచి ఎన్నికైన రాజాసింగ్ ఎన్నికల అఫిడవిట్ లో కేసుల వివరాలు తెలుపలేదంటూ టీఆర్ఎస్ అభ్యర్థి  ప్రేమ్ సింగ్ రాథోడ్ వేసిన పిటిషన్ ను గతంలో రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాథోడ్ ఈ ఏడాది ఏప్రిల్ లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను మంగళవారం జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ వి రామసుబ్రమణ్యన్​ల ధర్మాసనం విచారించింది. రాజాసింగ్ తరఫున అడ్వొకేట్లు వినయ్, ఆంథోని రెడ్డి, భాస్కర్ గౌతమ్ లు హాజరయ్యారు.

ఈ కేసు విచారణ వాయిదా వేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై జస్టిస్ వి రామసుబ్రమణ్యన్  స్పందిస్తూ... ‘తెలంగాణ లో జాతక చక్రాల ప్రకారం గ్రహాలన్నీ కలిసి ఈ కేసు ను వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలు జ్యోతిష్యం ఆధారంగా వస్తాయి’ అంటూ వ్యంగ్యంగా కామెంట్​ చేశారు. 2018 ఎన్నికల సమయంలో తాను తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న సందర్భంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తదుపరి విచారణను  జనవరికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. అయితే, ఇందుకు సంబంధించిన రాతపూర్వక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. కాగా.. తెలంగాణ ఎన్నికలపై సుప్రీం కోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి.