పార్టీలన్నీ ఫండ్స్ వివరాలు ఇవ్వాల్సిందే.. సుప్రీం ఆదేశం

పార్టీలన్నీ ఫండ్స్ వివరాలు ఇవ్వాల్సిందే..  సుప్రీం ఆదేశం

కేంద్రం తీసుకువచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్ స్కీమ్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. రాజకీయ పార్టీలన్నీ విరాళాల వివరాలు సీల్డ్ కవర్ లో మే30లోపు…ఈసీకి అందించాలని ఆదేశించింది. ఎలక్ట్రోరల్ బాండ్ స్కీమ్ కేసుపై విచారించిన ధర్మాసనం.. ఈ మేరకు అన్ని పార్టీలకు ఆదేశాలు జారీ చేసింది.

మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్ విధానం 2018 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం భారత పెట్టుబడులు ఎక్కువున్న విదేశీ కంపెనీల నుంచి నిధులు సేకరించవచ్చు. దీనికి అనుగుణంగా ఫెమా నిబంధనలు కూడా మార్చారు. కొత్త విధానం అమల్లోకి వచ్చాకా 2018 అక్టోబర్ నాటికే 600 కోట్ల రూపాయల మేర నిధులు రాజకీయ పార్టీలకు అందాయి. అందులో ఎక్కువగా బీజేపీకే వచ్చాయి. 2018 మార్చి నెలలో 220 కోట్ల రూపాయల బాండ్లు అమ్మగా.. అందులో 210 కోట్ల రూపాయలు ఒక బీజేపీకే అందాయి.

ఎలక్ట్రోరల్ బాండ్ స్కీమ్ ను ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అనేకమంది, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, మార్క్సిస్టు పార్టీలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దేశ రాజకీయాలపై, ప్రజాస్వామిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర సర్కార్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుతో పాటు, కేంద్ర ఎన్నికల సంఘం కూడా తప్పుబట్టాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు కూడా తన అభ్యంతరాన్ని తెలిపింది. కొత్త విధానంతో కార్పొరేట్ కంపెనీలు రాజకీయపార్టీలకు ఇచ్చే నిధులపై పరిధి, పరిశీలన పూర్తిగా తొలిగిపోతుందని, దీని ఫలితంగా రాజకీయ వ్యవస్థలో పారదర్శకత పూర్తిగా పోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది రాజకీయ పార్టీల వ్యవహారంగా కూడా చూడరాదని ఈసీ విన్నవించింది. విదేశీ నిధులతో భారత రాజకీయాల్లో, రాజ్యాంగ పాలనా వ్యవస్థలో రాబోయే మార్పులు, జరుగబోయే పరిణామాల గురించి ఆలోచించాలని కోరింది. కేంద్ర ఎన్నికల కమిషన్ మోడీ ప్రభుత్వానికి 2017కు ముందు రాసిన లేఖలను సుప్రీంకోర్టుకు సమర్పించింది ఎన్నికల సంఘం.