కోర్టు ధిక్కరణ కేసులో విజయ్ మాల్యాకు జైలు శిక్ష

కోర్టు ధిక్కరణ కేసులో విజయ్ మాల్యాకు జైలు శిక్ష

ఢిల్లీ : కోర్టు ధిక్కరణ కేసులో విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు 4 నెలల జైలు శిక్ష విధించింది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టి పరారీలో ఉన్న విజ‌య్ మాల్యా పై 2017-కోర్టు ధిక్కార కేసుపై సుప్రీంకోర్టు సోమ‌వారం తీర్పు వెల్లడించింది. 4 నెలల జైలు శిక్షతో పాటు రూ. 2 వేలు జరిమానా విధించింది. నాలుగు వారాల్లోగా 40 మిలియన్ డాలర్లను వడ్డీతో సహా డిపాజిట్ చేయాలని విజయ్ మాల్యాకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా 317 కోట్లను విజయ్ మాల్యా తన పిల్లల పేరున ట్రాన్స్ఫర్ చేశాడు. 

దీంతో  కోర్టు తీర్పును ఉల్లంఘించాడని న్యాయస్థానం నిర్ధారించింది. అలాగే, తమ ఎదుట హాజరు కావాలని ఎన్నోసార్లు కోరినప్పటికీ ఆయన హాజరు కాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 10న మాల్యాకు కోర్టు చివరి అవకాశం ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో న్యాయవాదితో కలిసి రెండు వారాల్లో కోర్టుకు హాజరు కావాలని, లేదంటే కేసుకు తార్కిక ముగింపు తప్పదని వార్నింగ్ ఇచ్చింది. న్యాయస్థానం ఇచ్చిన చివరి అవకాశాన్ని కూడా మాల్యా వినియోగించుకోకపోవడంతో సోమవారం శిక్ష విధించింది.