వీధుల్లోని ప్రతి కుక్కనూ తరలించాలని చెప్పలేదు:సుప్రీంకోర్టు

వీధుల్లోని ప్రతి కుక్కనూ తరలించాలని చెప్పలేదు:సుప్రీంకోర్టు
  • టీకాలు వేసి, స్టెరిలైజేషన్ చేయాలనే ఆదేశించాం: సుప్రీంకోర్టు 
  • కుక్కలను తరలిస్తే ఎలుకల సమస్య పెరుగుతుందనే వాదన సరికాదని కామెంట్ 

న్యూఢిల్లీ: అన్ని వీధి కుక్కలను రోడ్ల నుంచి పూర్తిగా షెల్టర్లకు తరలించాలని ఎప్పుడూ ఆదేశించలేదని, వీధి కుక్కలకు టీకాలు వేసి, స్టెరిలైజేషన్ చేసి మళ్లీ అదే ప్రాంతంలో విడిచిపెట్టాలని మాత్రమే చెప్పామని సుప్రీంకోర్టు తెలిపింది. పెంపుడు కుక్క ఎవరిపైనైనా దాడి చేస్తే “నేను ఉద్దేశపూర్వకంగా దాడి చేయించలేదు” అని ఓ మాట చెప్పి ఇకపై తప్పించుకోలేరని.. యజమానిని నేరస్తుడిగా పరిగణిస్తామని వెల్లడించింది. 

వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియా బెంచ్ గురువారం రెండో రోజు విచారణ చేపట్టింది. సీనియర్ అడ్వకేట్స్ వాదిస్తూ..కుక్కలను షెల్టర్లకు తరలిస్తే ఎలుకల సమస్య పెరుగుతుందన్నారు. వీధి కుక్కలను  షెల్టర్లలో ఉంచడానికి  సదుపాయాలు, బడ్జెట్ లేవన్నారు. 

వీధి కుక్కలను పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని తెలిపారు. ప్రజలు, మీడియా, ప్రభుత్వం,ఇతరుల  ఫిర్యాదులతో కోర్టు ఒత్తిడిలో ఉందని.. అందుకే వీధి కుక్కలను తరలించాలని కఠినంగా ఆదేశిస్తోందని వాదించారు.

పిల్లులను పెంచితే బాగుంటది కదా!

కుక్కలను తరలిస్తే ఎలుకల సమస్య పెరిగిపోతుందనే వాదనకు కోర్టు స్పందిస్తూ.." కుక్కలు, పిల్లులు ఒకదానికొకటి శత్రువులు కదా! ఎలుకలను పిల్లులు కూడా చంపేస్తాయి. కాబట్టి మరిన్ని పిల్లులను పెంచితే బాగుంటుంది కదా!" అని చమత్కరించింది. ఆసుపత్రులు, పాఠశాలలు, బస్సు, రైల్వే స్టేషన్ల తదితర వంటి రద్దీ ప్రాంతాల్లో కుక్కలను తప్పకుండా తరలించాల్సిందే. సౌలతులు లేవనే సాకుతో నియమాలు అమలు చేయకుండా ఉండకూడదు”అని తెలిపింది. 

పెంపుడు కుక్కలకు మైక్రోచిప్ తప్పనిసరి అయినా, నిజంగా అమలవుతోందా అని కోర్టు ప్రశ్నించింది. "మేం ఎలాంటి ఒత్తిడిలో లేం. మా నిర్ణయాలు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా ఉంటాయి" అని తేల్చిచెప్పింది. వీధి కుక్కలను మనుషులు కొట్టడం, విషం పెట్టడం, లైంగిక దాడి చేయడం సాధారణమని ఓ న్యాయవాది వాదించగా.. కోర్టు ఆ వాదనను పట్టించుకోకుండా ముఖ్యమైన సమస్యలపైనే దృష్టిపెడతామని చెప్పింది.  

తదుపరి విచారణను శుక్రవారానికి(9 వ తేదీ) వాయిదా వేసింది. "ఆన్ ది రూఫ్ ఆఫ్ ది వరల్డ్, ఫెరల్ డాగ్స్ హంట్ డౌన్ లడాఖ్స్ రేర్ స్పీసీస్" నివేదికను చదివుకుని రావాలని న్యాయవాదులకు కోర్టు సూచించింది.